మెట్టు దిగరు.. పట్టు వదలరు | - | Sakshi
Sakshi News home page

మెట్టు దిగరు.. పట్టు వదలరు

Feb 27 2025 7:55 AM | Updated on Feb 27 2025 7:55 AM

మెట్టు దిగరు.. పట్టు వదలరు

మెట్టు దిగరు.. పట్టు వదలరు

ఎంఆర్‌ఎఫ్‌ యాజమాన్యం, కార్మికుల మధ్య కుదరని సయోధ్య

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): సదాశివపేట మండలంలోని అంకేనపల్లి శివారులో గల ఎంఆర్‌ఎఫ్‌(ఏపీఎల్‌) ప్లాంట్‌లో పనిచేస్తున్న 338మందికి పైగా కార్మికుల భవితవ్యంపై ఇంకా సస్పెన్స్‌ వీడలేదు. వీరి భవిష్యత్తును పట్టించుకోవాల్సిన అధికారులు, పరిశ్రమ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో కార్మికులు మనోవేదనకు గురవుతున్నారు. పరిశ్రమ యాజమాన్యం కార్మిక చట్టాల్ని ఉల్లంఘిస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రిక్రూట్‌మెంట్‌ సమయంలో చేసుకున్న ఒప్పందం మేరకు పర్మినెంట్‌ చేయాలని కోరిన పాపానికి పరిశ్రమ యాజమాన్యం పనిలో నుంచి తీసేసి నియంతృత్వాన్ని ప్రదర్శిస్తోందని కార్మికులు వాపోతున్నారు.

నాలుగేళ్లయినా పర్మినెంట్‌ చేయని

యాజమాన్యం

డీఆర్డీఏ ఆధ్వర్యంలో రాత పరీక్ష,ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా నియామకం చేసుకుని వారికి ప్రత్యేక శిక్షణనిచ్చి ప్రొడక్షన్‌, ఇతర విభాగాల్లో 338మందికి పైగా కార్మికులను చేర్చుకున్నారు. నిబంధనల ప్రకారం మూడున్నరేళ్లు పూర్తికాగానే పర్మినెంట్‌ చేస్తామని పరిశ్రమ యాజమాన్యం నాడు ఒప్పందం చేసింది. యాజమాన్యం మాట ప్రకారం కార్మికులు పనిచేస్తూ వచ్చారు. తీరా నాలుగేళ్లు పూర్తయినా పర్మినెంట్‌ చేయకపోవడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. దీంతో కార్మికులను విధుల్లోకి రావొద్దని ఫోన్‌ చేసి చెప్పారు. విధుల నుంచి తొలగించిన కార్మికులను పట్టించుకోవాల్సిన కార్మికశాఖ అధికారులు పక్షం రోజుల నుంచీ నోరుమెదపడం లేదు.

చర్చల పేరిట కాలయాపన..

కార్మికుల భవితవ్యంపై గతంలో రెండుసార్లు జరిగిన చర్చలు విఫలం కావడంతో తాజాగా ఈ నెల22న మరోసారి చర్చలు జరిపారు. అవి కూడా విఫలం కావడంతో పరిశ్రమ యాజమాన్యం ఈ నెల 28న తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని కార్మికశాఖ అధికారులు తెలిపారు. అయితే కార్మికులు మాత్రం చర్చల పేరిట కాలయాపన చేస్తూ తమ జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement