జన్నారం: ఓ వైపు అధికారులు నిఘా పెట్టిన వారి కళ్లు కప్పుకొని స్మగ్లర్లు విలువైన టేకు చెట్లను ఎత్తుకెళ్తున్నారు. జన్నారం డివిజన్‌లో ఇటీవల రెండు ఘటనలు చోటు చేసుకోగా తాజాగా పైడిపెల్లి బీట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు రంపాలతోటేకు చెట్లను కోసి దుంగలను ఎత్తుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు గమనించి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం బయటకు వచ్చింది. మొత్తం నాలుగు చెట్లు కోసి, విలువైన టేకు దుంగలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయమై రేంజ్ అధికారి బాబ ఖాదర్ వలీని ‘సాక్షి’సంప్రదించగా అక్రమ ఇసుక రవాణా అడ్డుకుంటున్నందున కొందరు మాపై కక్షతోనే ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు అనుమానం ఉందన్నారు. రెండు చెట్లను గుర్తించామని, మరో రెండు పాత చెట్లను గుర్తించాల్సి ఉందన్నారు.


