శ్రీరాంపూర్: తమ డిమాండ్లను యజమాన్యం పరిష్కరించాలని సింగరేణి అధికారులు నిరసన తెలిపారు. కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఎంఓఏఐ) సింగరేణి బ్రాంచి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని నస్పూర్ కాలనీలో శుక్రవారం సాయంత్రం నల్లదుస్తులు, రిబ్బన్లు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ బ్రాంచి అధ్యక్షుడు టీ.లక్ష్మీపతిగౌడ్, ప్రధాన కార్యదర్శి నర్సింహులు మాట్లాడుతూ రెండేళ్ల పీఆర్‌పీ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. కోలిండియాలో 2024, 2025 పీఆర్‌పీ చెల్లింపుల ప్రక్రియ మొదలైనా సింగరేణిలో ఇంకా 2022, 2023 సంవత్సరాలకు సంబంధించినవి కూడా చెల్లించలేదని తెలిపారు. పదోన్నతుల్లో అన్యాయం జరుగుతోందని, కోలిండియాలో మాదిరిగా పాలసీని అమలు చేయాలని అన్నారు. బదిలీలు, పోస్టింగ్‌ల్లో పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో వర్క్‌టు రూల్, నిరసన దీక్షలు, నిరాహార దీక్షలు, అవసరమైతే సమ్మెకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. శ్రీరాంపూర్‌తోపాటు మందమర్రి, బెల్లంపల్లి, ఆర్జీ 1, ఆర్జీ 2 ఏరియాల నుంచి అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. నస్పూర్ కాలనీలోని సేవా భవన్ నుంచి మొదలైన ర్యాలీ షిర్కే, రాయల్ టాకీస్, సీసీసీ కార్నర్ మీదుగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఏరియా అధ్యక్షుడు కే.వెంకటేశ్వర్‌రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు పీ.శ్రీనివాస్, అపెక్స్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఏవీ రెడ్డి, ఉపాధ్యక్షులు చిలుక శ్రీనివాస్, ఏరియా జాయింట్ సెక్రెటరీ రాజగోపాల్ పాల్గొన్నారు.


