మంచిర్యాలటౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు కుమ్మకై ్క సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపట్టక పోవడం, మెడికల్ బోర్డును ఏర్పాటు చేయక పోవడంతో మాజీ మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో బొగ్గుబాయి బాట పట్టామన్నారు. దీనికి ఖంగుతిన్న కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడిగా 335 మందికి కారుణ్య నియామక పత్రాలు ఇచ్చి, మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం బొగ్గుబాయిల వేలంలో సింగరేణి పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా కేంద్రం ఇవ్వలేదన్నారు. అబద్దాలను వల్లెవేసి ప్రజలను తప్పుదారి పట్టించాలనే బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివా కర్‌రావు మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి పేరు భట్టి విక్రమార్క కాదని, బకాయి విక్రమార్క అన్నా రు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదన్నారు. విశ్వనాథ ఆలయం అభివృద్ధికి 2023లోనే రూ. 1.97 కోట్ల నిధులు మంజూరు చేయిస్తే, అభివృద్ధి చేయకుండా, అవే నిధులతో కొత్త పనుల పేరిట శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రిటైర్డ్ సింగరేణి కార్మికులకు ఇంటి నిర్మాణం కోసం రెండు గుంటల భూమి ఇస్తానని చెప్పి, ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


