ఆదిలాబాద్‌రూరల్: ఆదివాసీల హక్కులు, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తామని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేశ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కేసీబీ గార్డెన్‌లో ఆదివారం రాష్ట్రస్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలకే ఉద్యోగవకాశాలు కల్పించే జీవో నంబర్ 3ను యథావిధిగా అమలు చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక డీఎస్సీని వెంటనే ప్రకటించాలన్నారు. 1/70, పెసా చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఆదివాసీలు సాగుచేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అంతకుముందు పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో జాతీయ అధ్యక్షుడు వట్టం ఉపేందర్, ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బక శ్రావణ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉయక సుదర్శన్, నాయకులు వెట్టి మనోజ్, అర్క శేషారావు, గోడం రేణుక బాయి, ఉయిక ఇంద్ర పాల్గొన్నారు.


