బెల్లంపల్లి: అప్పు, వడ్డీ డబ్బుల కోసం ట్రాక్టర్‌ను తీసుకువెళ్లిన వ్యక్తిపై చోరీ కేసు నమోదు చేయాలని మంగళవారం తాళ్ల గురిజాల పోలీస్‌స్టేషన్ ఆవరణలో మందు డబ్బాతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లి మండలం బుధాకలాన్ గ్రామానికి చెందిన గుంపుల లక్ష్మణ్ మధ్యవర్తిగా ఉండి అదే గ్రామానికి చెందిన బియ్యాల పోశం వద్ద నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన సురేశ్‌కు కొన్నాళ్ల క్రితం రూ.5 లక్షలు అప్పు ఇప్పించాడు. ఇప్పటికే పోశంకు కొంత మొత్తం ముట్టజెప్పగా ఇంకా రూ.3లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలో పోశంకు మధ్యవర్తిగా ఉన్న లక్ష్మణ్‌కు పెద్ద మనుషుల సమక్షంలో పలుసార్లు పంచాయతీలు జరిగాయి. వాయిదాలు దాటినా డబ్బులు చెల్లించకపోవడంతో విసుగు చెందిన పోశం మధ్యవర్తికి చెందిన ట్రాక్టర్‌ను తీసుకువెళ్లాడు. అయితే, తన ట్రాక్టర్‌ను ఎవరో దొంగిలించారని లక్ష్మణ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆరా తీసి పోశం డబ్బుల కోసమే ట్రాక్టర్‌ను తీసుకువెళ్లినట్లు గుర్తించారు. వెంటనే ఆ ట్రాక్టర్‌ను ఠాణాకు తీసుకురావాలని ఎస్సై రామకృష్ణ ఆదేశించడంతో పోశం తీసుకువెళ్లి అప్పగించాడు. ట్రాక్టర్‌ను తీసుకువెళ్లమని ఎస్సై సమాచారం ఇచ్చినా లక్ష్మణ్ నిరాకరించి పోశంపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టడంతో సమస్య జఠిలంగా మారింది. ట్రాక్టర్ తీసుకువెళ్లిన పోశంపై కేసు పెట్టకుండా తమనే వేధింపులకు గురి చేస్తున్నాడని లక్ష్మణ్ దంపతులు ఆరోపిస్తున్నారు. ఈమేరకు మంగళవారం పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. మనస్తాపానికి గురైన లక్ష్మణ్ భార్య భాగ్య మందు డబ్బాతో వచ్చి పోలీస్‌స్టేషన్ ఆవరణలో తాగేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, ఎస్సై రామకృష్ణ మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరిగింది. వెంటనే భాగ్యను చికిత్స కోసం కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయమై ఎస్సై రామకృష్ణను వివరణ కోరగా అప్పు డబ్బుల కోసం పోశం ట్రాక్టర్‌ను తీసుకు వెళ్లాడని, అది చోరీ కిందకు రాదని తెలిపారు. ట్రాక్టర్‌ను తీసుకువెళ్లమని చెప్పినా లక్ష్మణ్ తీసుకువెళ్లడం లేదని పేర్కొన్నారు.


