మంచిర్యాలటౌన్/బెల్లంపల్లి/చెన్నూర్: ఈ నెల 20న దేశవ్యాప్తంగా ఒక్కరోజు మెడికల్ షాపుల బంద్ తలపెట్టినట్లు జిల్లా కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలు ఆపాలని, కార్పొరేట్ సంస్థలకు భారీ డిస్కౌంట్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆన్‌లైన్ ఫార్మసీతో మందుల అమ్మకాలపై నియంత్రణ ఉండదని, నకిలీ, మత్తు కలిగించే మందులు ప్రిస్కిప్షన్ లేకుండా విచ్చలవిడిగా దొరికే అవకాశం ఉంటుందని ఆరోపించారు. తేలికగా దొరికే ఇలాంటి మందులతో యువత భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ డిస్కౌంట్లతో ఆన్‌లైన్‌లో అమ్మే మందులతో చిన్నచిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మెడికల్ షాపుల మనుగడకు ఇబ్బందిగా మారే అవకాశముందని తెలిపారు. బెల్లంపల్లిలో సబ్ కలెక్టర్ మనోజ్‌కు బెల్లంపల్లి మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు సజ్జన్ శర్మ, సెక్రటరీ పెద్ది రాజేందర్, సభ్యులు వినతిపత్రం అందజేశారు. బంద్‌కు సహకరించాలని చెన్నూర్‌లో డిప్యూటీ తహసీల్దార్ సనత్‌కుమార్, సీఐ భన్సీలాల్‌కు కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బుద్దారపు ప్రకాశ్, బండారి లక్ష్మణ్ వినతిపత్రం అందజేసి కోరారు.
అత్యవసరమైతే సంప్రదించాలి
ఎవరికై నా మందులు అత్యవసరమైతే అసోసియేషన్ సభ్యులు ఎం.చంద్రశేఖర్‌రావును 9849108736, తొగరు సుధాకర్‌ను 9866223544, జి.రాజేంద్రప్రసాద్‌ను 9247393239 నంబర్లలో సంప్రదించాలి. ఆన్‌లైన్ అమ్మకాల నిలిపివేతకు చేపట్టిన బంద్‌కు ప్రజలు సహకరించాలి.
– తొగరు సుధాకర్, డిస్ట్రిక్ట్ కెమిస్ట్,
డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ


