భీమారం: కాళేశ్వరంలో ఈ నెల 21నుంచి ప్రారంభం కానున్న సరస్వతి నది అంత్యపుష్కరాలకు వెళ్లే భక్తుల వాహనాలకు మండలంలోని జోడువాగులపై గల ఇరుకువంతెన వద్ద ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. మంగళవారం జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌తో కలిసి జాతీయ రహదారిపై గల ఇరుకువంతెనను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రత చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై ఆధికారులతో చర్చించారు. వారి వెంట ఎస్సై రాజేందర్ ఉన్నారు.
పశువులను తరలిస్తే కఠినచర్యలు
కోటపల్లి: బక్రీద్ నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలను పటిష్టంగా అమలు చేయడంలో భాగంగా పశువులను అక్రమంగా తరలించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని డీసీపీ భాస్కర్ హెచ్చరించా రు. రాపన్‌పల్లి వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును ఆయన పరిశీలించారు. విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్‌శాఖ పటిష్ట చర్యలు చేపడుతోందని తెలిపారు. మహారాష్ట్ర వైపునుంచి ధాన్యం అక్రమంగా రాకుండా వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సమన్వయం చేసుకుని తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజేందర్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.


