ఏ రోజు మృతదేహాలను అదేరోజు తరలిస్తున్న వైద్యులు, సిబ్బంది గుర్తు తెలియని డెడ్ బాడీలు వస్తే భద్రపరిచే పరిచే అవకాశమేది? మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఉన్నొక్కటి నిరుపయోగమే..
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మార్చురీ గదిలో కొంతకాలంగా ఫ్రీజర్ పనిచేయడం లేదు. గతంలో పలుసార్లు మరమ్మతు చేయించినా కొద్దిరోజులే పనిచేసి ఆ తర్వాత మూలన పడింది. దీంతో దానికి మరమ్మతు చేయించడమే మానేశారు. ప్రస్తుతానికి గుర్తు తెలియని మృతదేహాలు కూడా రాకపోవడంతో ఇబ్బంది లేదు. ఇతర మృతదేహాలు వస్తే వెంటనే పోస్టుమార్టం నిర్వహించి మృతుల కుటుంబాలకు అప్పగిస్తుండడంతో సమస్యేమీ లేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా కొనసాగుతున్న మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి సరైన మార్చురీ గది కూడా లేదు. కనీసం ఫ్రీజర్ కూడా లేకపోవడం, మరమ్మతుకు గురైన దాని స్థానంలో కొత్త ఫ్రీజర్‌ను ఏర్పాటు చేయకపోవడంతో ఒక్కరోజు కంటే ఎక్కువ సమయం మార్చురీలో మృతదేహం ఉంటే దుర్వాసన వచ్చే అవకాశముంది. నూతనంగా చేపట్టిన మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. పనులు కొనసాగుతుండగా మార్చురీ కోసం నూతన ఫ్రీజర్‌ను కొత్త భవనంలో ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెలాఖరులోపు కొత్త ఫ్రీజర్‌ను నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవనంలో ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్ తెలిపారు.
బెల్లింపల్లిలో మూడింట్లో రెండు మూలకే..
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియాస్పత్రి మార్చురీకి నెలలో గరిష్టంగా 25కు పైగా మృతదేహాలు పోస్టుమార్టం కోసం వస్తుంటాయి. రైలు, రోడ్డు ప్రమాదాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చనిపోతే వారి మృతదేహాలను మార్చురీలో భద్రపరుస్తారు. మృతుల కుటుంబీకుల ఆచూకీ తెలిసేదాకా కనిష్టంగా వారంపాటు మృతదేహా లు కుళ్లిపోకుండా ఫ్రీజర్‌లో భద్రపర్చాల్సి ఉంటుంది. ఒక్కోసారి రెండు మృతదేహాలు వచ్చినపుడు ఫ్రీజర్ సమస్య ఏర్పడుతోంది. ప్రస్తుతం మార్చరీలో ఒకే ఫ్రీజర్ మాత్రమే అందుబాటులో ఉంది. రెండు ఫ్రీజర్‌లు మరమ్మతుకు నోచుకోక నిరుపయోగంలో ఉన్నాయి. వీటికి మరమ్మతు చేయించడంలో నిర్లక్ష్యం జరుగుతోంది. అదనంగా మరో ఫ్రీజర్‌ను అందుబాటులో ఉంచాల్సిన అవసరముంది. కాగా, మార్చురీ గదిని ఆనుకుని చేపట్టిన ప్రహరీ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. దీంతో రోడ్డు పక్కన, గది ఆరుబయట ఒక్కోసారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. మార్చురీ గదికి వెళ్లడానికి సీసీ రోడ్డు నిర్మించాల్సిన అవసరముంది.


