పెరగనున్న భూముల ధరలు | - | Sakshi
Sakshi News home page

పెరగనున్న భూముల ధరలు

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

● సామాన్యులపై అధిక భారం ● సర్కారుకు తగ్గనున్న ఆదాయం

మంచిర్యాలటౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం భూముల ధరలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో ఖాళీ స్థలం చదరపు గజానికి కనిష్టంగా రూ.2,400 కాగా, గరిష్టంగా రూ.15,900 ఉంది. అపార్టుమెంట్లలోని ప్లాట్లు చదరపు అడుగు ధర కనిష్టంగా రూ.1,800 కాగా, గరిష్టంగా రూ.2,500 ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో ఉన్న విలువలకు అనుగుణంగా ఎక్కడా 100 శాతానికి మించకుండా, కనీసం ఐదు శాతం పెంచుతూ సవరణ చేపట్టనున్నారు. దీంతో జిల్లాలోనూ భూముల ధరలు పెరగనున్నాయి. ఖాళీ స్థలం చదరపు గజానికి కనిష్టంగా రూ.4వేలు, గరిష్టంగా రూ.18వేలు కానుంది. అపార్టుమెంట్లలోని ప్లాట్ల ధర కనిష్టంగా రూ.2,500, గరిష్టంగా రూ.3,500 కానుంది.

‘రియల్‌’ వ్యాపారం కుదేలే..!

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడేళ్లుగా అంతంత మాత్రంగానే సాగుతోంది. అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచి ప్రతీరోజు అంతంత మాత్రంగానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వానికీ ఆదాయం తగ్గిపోయింది. గతంలో ‘రియల్‌’ వ్యాపారం బాగా జరిగినప్పుడే భూముల ధరలు పెద్ద ఎత్తున పెరిగి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. ‘రియల్‌’ వ్యాపారం కుదేలు కావడంతో పెరిగిన ధరల ప్రకారంగా భూముల క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. అంతంత మాత్రంగానే సాగుతున్న ‘రియల్‌’ వ్యాపారానికి భూముల ధరల పెంపు నిర్ణయంతో ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతీరోజు 90 స్లాట్ల వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండగా, 30లోపు మాత్రమే జరుగుతున్నాయి. భూముల మార్కెట్‌ విలువలు పెరిగితే సామాన్యులకు ఆర్థికంగా భారం కావడంతో పాటు రిజిస్ట్రేషన్లు మరింత తగ్గి ప్రభుత్వానికీ ఆదాయం తగ్గే అవకాశముంది. ఇప్పటికే ఏర్పాటు చేసిన వెంచర్లు ప్లాట్ల అమ్మకాలు లేక వెలవెలబోతుండగా, కొత్త వెంచర్ల ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది.

Advertisement
 
Advertisement
Advertisement