నీళ్లల్లో హాయ్‌ హాయ్‌.. | - | Sakshi
Sakshi News home page

నీళ్లల్లో హాయ్‌ హాయ్‌..

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

● వేసవిలో ఉల్లాసంగా గడిపేందుకు.. ● ఉత్సాహం చూపుతున్న నిర్మల్‌ జిల్లావాసులు ● వాటర్‌పార్కుల్లో ఎంజాయ్‌ చేస్తూ.. ● దూర ప్రాంతాలకు టూర్‌ వెళ్తూ..

నిర్మల్‌: వేసవి సెలవులను ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు జిల్లావాసులు ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా వాటర్‌ పార్కులు, రిసార్టులు జిల్లాలో అందుబాటులోకి రావడంతో కుటుంబాలతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రానికి సమీపంలోనే సారంగపూర్‌ మండలం రాణాపూర్‌ వద్ద పచ్చని ప్రకృతి ఒడిలో వండర్‌ల్యాండ్‌ పేరిట వాటర్‌పార్క్‌ ఏర్పాటు చేశారు. కృత్రిమ జలపాతం, రెయిన్‌డ్యాన్స్‌లతో పాటు అరుదైన జిప్‌ సైకిల్‌, జిప్‌లైన్‌, రాకెట్‌ ఎజెక్షన్‌, 360 డిగ్రీల సైకిలింగ్‌, నాలుగుసీట్ల గైరో, క్రేజీ రోలర్‌, బుల్‌రైడ్‌, బౌన్సీ, పిల్లలకు నెట్‌ ట్రాంపోలిన్‌ ఇలా ఎన్నో అడ్వెంచర్లు ఉన్నాయి. వేసవి తాపాన్ని మరిచిపోయేలా వాటర్‌పార్కులు, స్విమ్మింగ్‌పూల్స్‌తో కూడిన రిసార్టుల్లో జిల్లావాసులతో సందడి చేస్తున్నారు. కాస్త ఆసక్తి ఉన్నవాళ్లు కశ్మీర్‌, లద్దాఖ్‌, సిమ్లా, సిక్కిం తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. అంతదూరం వద్దనుకున్నవాళ్లు ఊటీ, కొడైకెనాల్‌ వంటి చల్లని ప్రదేశాలకు కుటుంబంతో కలిసి వెళ్లి కూల్‌గా గడిపేస్తున్నారు. మార్గమధ్యలో ప్రసిద్ధ ఆలయాలు, పేరొందిన టూరిస్ట్‌ ప్రాంతాలనూ దర్శిస్తున్నారు.

మిత్రులతో కలిసి..

కుటుంబసభ్యులంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు ఇతర నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. మాకూ ఇలాంటివి తప్పలేదు. దూరప్రాంతాలకు వెళ్లే పరిస్థితులు లేనివాళ్ల కోసం ఇక్కడే ఏదైనా చేయాలన్న లక్ష్యంతో మిత్రులం కలిసి ‘వండర్‌ల్యాండ్‌’ను ఏర్పాటు చేశాం. ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిరోజూ మంచి స్పందన ఉంటోంది.

– నూకల గురుప్రసాద్‌, వండర్‌ల్యాండ్‌ వాటర్‌పార్క్‌

కశ్మీర్‌ భూతలస్వర్గమే..

వేసవిలో ఎటైనా వెళ్లాలనుకునే వారికి మంచి టూర్‌ కశ్మీర్‌. హిమాలయ అందాలతో భూతలస్వర్గాన్ని తలపిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా కశ్మీర్‌ అందాలను తిలకించాల్సిందే. ఈ సీజన్‌లో కుటుంబంతో ‘కూల్‌’గా వాటన్నింటినీ ఆస్వాదించడం ఎప్పటికీ మర్చిపోలేం.

– నగేశ్‌, టీచర్‌, నిర్మల్‌

ఈ చిత్రంలో ఉన్న వీరంతా నిజామాబాద్‌, బాన్సువాడకు చెందిన కుటుంబసభ్యులు. వాటర్‌పార్క్‌లో ఓ రోజంతా పిల్లలతో ఎంజాయ్‌ చేయడానికి వచ్చారు. అంతదూరం నుంచి వచ్చిన వారంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా వాటర్‌పార్క్‌లో, రెయిన్‌డ్యాన్స్‌లో చల్లగా సేదదీరారు. పిల్లలతో పాటు పెద్దలూ ఇక్కడి వాటర్‌గేమ్స్‌ను

ఎంజాయ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement