దిలావర్‌పూర్: ప్రమాదవశాత్తు కోనేరులో మునిగి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల మేరకు సారంగాపూర్ మండలంలోని తాండ్ర గ్రామానికి చెందిన పచ్చిమట్ల శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి దిలావర్‌పూర్‌లోని ఎల్లమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లారు. అతని చిన్న కుమారుడైన రోహిత్‌గౌడ్ (24) కోనేరులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వడదెబ్బతో వృద్ధురాలు..
భైంసాటౌన్: పట్టణంలోని గణేశ్‌నగర్‌కు చెందిన రావుల లక్ష్మీబాయి (68) వడదెబ్బతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలి భర్త, కుమారుడు గతంలోనే చనిపోగా, ఆమె కూరగాయలు విక్రయిస్తూ ఒంటరిగా ఉంటోంది. సోమవారం వారసంతలో కూ రగాయలు విక్రయించేందుకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకుంది. వాంతులు చేసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మంగళవారం ఉదయం స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
గంజాయి పట్టివేత
ఖానాపూర్: గంజాయి అక్రమ రవాణా కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు సత్తనపల్లి గ్రామ పరిధిలోని రాంరెడ్డిపల్లి బస్టాప్ వద్ద మంగళవారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద సుమారు 1.10 కిలోల గంజాయి లభించింది. చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయించేందుకు తీసుకువచ్చినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. నిందితుడిని బిహార్‌కు చెందిన మనీష్ పాస్వాన్‌గా గుర్తించారు. గంజాయిని సీజ్ చేసి ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీ సులు తెలిపారు. సీఐ అజయ్, ఎస్సై రాహుల్ గైక్వా డ్, కానిస్టేబుల్ బీమ్రాజు, సుధీర్, హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డిని ఎస్పీ అభినందించారు.


