ఆదిలాబాద్‌రూరల్: దాడి దోపిడీ, హత్యాయత్నం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిధర్ తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 17న రాత్రి లాండసాంగ్వి గ్రామానికి చెందిన అశోక్ ఆదిలాబాద్ నుంచి యాపల్‌గూడ వెళ్లేందుకు పట్టణంలోని వినాయక్ చౌక్‌లో గల పెట్రోల్ పంపు వద్ద వాహనాల కోసం వేచి చూస్తుండగా దండుగుల వెంకటేష్ లిఫ్ట్ ఇస్తానని వాహనంపై ఎక్కించుకున్నాడు. బంగారిగూడ అనుకుంట గ్రామాలకు మధ్యలో ఉన్న బ్రిడ్జి వద్ద వాహనం ఆపి పెద్ద బండరాయితో తలపై కొట్టడమే కాకుండా కత్తితో మెడపై, చేతిపై గాయపరిచాడు. బాధితుడి వద్ద ఉన్న రూ.1,300, ఫోన్ తీసుకుని పరారయ్యాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. గురువారం అనుకుంట సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్, కత్తి, రూ.వెయ్యి నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై విష్ణువర్ధన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


