బుల్లి పిట్ట.. కనుమరుగైతే ఎట్టా? | - | Sakshi
Sakshi News home page

బుల్లి పిట్ట.. కనుమరుగైతే ఎట్టా?

Mar 20 2026 8:23 AM | Updated on Mar 20 2026 8:23 AM

● అంతరించిపోతున్న ఇంటి నేస్తాలు ● పర్యావరణ సమతుల్యంలో పిచ్చుకల పాత్ర ● నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

జన్నారం: ప్రకృతిలో మనిషితో అత్యంత సన్నిహితంగా ఉండే పక్షి పిచ్చుక. ఒకప్పుడు ఇంటి ముంగిట, పెరట్లోని చెట్లపై కిలకిలరావాలతో సందడి చేసే పిచ్చుకలు నేడు మచ్చుకై నా కనిపించడం లేదు. ఆధునిక జీవనశైలి, సెల్‌ టవర్ల రేడియేషన్‌, ఆహార కొరత కారణంగా ఈ చిన్నిప్రాణులు అంతరించిపోయే జీవాల జాబితాలోకి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన నేషనల్‌ ఫరెవర్‌ సొసైటీ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ దిలావర్‌ 2010 మార్చి 20న పిచ్చుకల దినోత్సవం నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటూ వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను పర్యావరణవేత్తలు గుర్తు చేస్తున్నారు.

ఎందుకు తగ్గుతున్నాయ్‌

పరిశోధనల ప్రకారం కొన్ని దశాబ్దాలుగా పిచ్చుకల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీనికి ప్రధాన కారణాలు అనేకంగా ఉన్నాయి. పాతకాలపు పెంకుటిళ్లు తగ్గిపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు.ఆధునిక కాంక్రీటు భవనాలలో పిచ్చుకలు గూళ్లు కట్టుకో వడానికి వీలైన సందులు, గూళ్లు ఉండడం లేదు. సెల్‌ టవర్ల నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు పిచ్చుకల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. దీనివల్ల అవి సంతానోత్పత్తి చేయలేక చనిపోతున్నాయి. కానీ ఈ విషయం సైంటిఫిక్‌గా నిరూపణ కాలేదని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. పంట పొలాల్లో పురుగుమందుల వాడకం వల్ల పిచ్చుకలకు ప్రధాన ఆహారమైన పురుగులు లభించడం లేదు.

రక్షణ ఇలా..

కాంక్రీటు భవనాల వల్ల పిచ్చుకలకు నివాసం కరువైంది. దీనిని అధిగమించేందుకు హన్మకొండ వంటి ప్రాంతాల్లో ఓరుగల్లు వైల్డ్‌ సొసైటీ సభ్యులు, పర్యావరణ ప్రేమికులు కృత్రిమ గూళ్లను, వరి కంకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం జన్నారం అటవీ డివిజన్‌లో అప్పటి ఎఫ్‌డీవో మాధవరావు తన ఇంటి పరిసరాలు, అటవీప్రాంతాల్లో కూడా కృత్రిమగూళ్లను ఏర్పాటు చేశారు. ఇదే విధంగా పట్టణాలు, మండల కేంద్రాల్లో కూడా జరగాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement