గోవింద్‌నాయక్‌ అస్తమయం | - | Sakshi
Sakshi News home page

గోవింద్‌నాయక్‌ అస్తమయం

Mar 17 2026 7:27 AM | Updated on Mar 17 2026 7:27 AM

● అనారోగ్యంతో స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే మృతి.. ● మూడుసార్లు ఖానాపూర్‌ నుంచి గెలుపు ● ఉమ్మడి జిల్లాతో విడదీయరాని బంధం

దండేపల్లి:నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మాజీ ఎమ్మెలే అజ్మీరా గోవింద్‌నాయక్‌(75) ఇక లేరు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. 2009 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వయస్సు పైబడడంతో ఆయన స్వగ్రామం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌లో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. నాలుగురోజుల క్రితం జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు రక్తంలో, మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు గుర్తించారు. చికిత్స ప్రారంభించారు. అయితే చికిత్సకు సహకరించకపోవడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. సోమవారం సాయంత్రం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య అనుసాయినాయక్‌, ముగ్గురు కొడుకులు అరవింద్‌, మిలన్‌, చందన్‌ ఉన్నారు.

నాలుగుసార్లు పోటీ.. మూడుసార్లు గెలుపు..

గోవింద్‌నాయక్‌ ఆరోజుల్లో బీఏ, ఎల్‌ఎల్‌బీ చదివాడు. రాజకీయాలకు ముందు హైకోర్టు న్యాయవాదిగా పనిచేశాడు. ప్రజాసేవ చేయాలని 1977లో అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఖానా పూర్‌ నియోజకవర్గం ఎస్టీ రిజర్వేషన్‌ కావడంతో జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. అయినా కుంగిపోలేదు. ఎమ్మెల్యేగా ప్రజా సేవా చేయాలని నియోజకవర్గంలో పర్యటిస్తూ, ప్రజలమధ్యే ఉంటూ, ప్రజా సమస్యలపై పోరా డారు. 1985లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎ మ్మెల్యేగా గెలిచారు. 1994లో టీడీపీ నుంచి పోటీచే సి గెలిచారు. 2004లో బీఆర్‌ఎస్‌(టీఆర్‌ఎస్‌)లో చే రి మూడోసారీ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2009 ఎన్నికలనుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ప్రజల మనిషిగా..

మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గోవింద్‌ నాయక్‌ ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. ఆయనకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో విడదీయని బంధం ఉంది. ఉమ్మడి జిల్లాతోపాటు, రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఒకసారి శాసనసభ కమిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఈరోజుల్లో ఎన్నికల్లో కోట్లు గుమ్మరిస్తుంటే, గోవింద్‌నాయక్‌ మాత్రం మూడుసార్లు ప్రజాభిమానంతోనే గెలుపొందారు. ఈ విషయాన్ని గతంలో ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. నిగర్విగా, సౌమ్యుడిగా, ప్రజల మనిషిగా గుర్తింపు పొందాడు. అయన మరణం ఉమ్మడి జిల్లాకు తీరని లోటని పలువురు విచారం వ్యక్తంచేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం లింగాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement