బాసర: బాసరలోని ఆర్జీయూకేటీలో 15 మంది విద్యార్థి ప్రతినిధులు, పరిపాలన అధికారులతో ఏబీ–3 కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం చర్చలు జరిగాయి. విద్య, ఇతర సమస్యలపై ఆందోళనలు వ్యక్తం చేశారు. అధికారులు అన్ని అంశాలను ఓపికగా విని రికార్డు చేశారు. విద్యార్థులు ఎక్కువగా నాన్–అకాడమిక్ సమస్యలు లేవనెత్తారు. కొన్ని పాయింట్లు అవగాహన లోపాలు, వాస్తవాలకు విరుద్ధమని పరిపాలన గుర్తించింది. అయినా సానుకూల స్పందనతో పారదర్శక చర్చల ద్వారా ఆరోగ్యకర వాతావరణాన్ని నెలకొల్పుకుంటామని తెలిపారు. 2008 నుంచి అడ్మిషన్లు, టెండర్లు, టెండర్లపై విచారణకు కమిటీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి క్రమబద్ధ పరిష్కారాలు అందిస్తామని స్పష్టం చేశారు. క్యాంపస్ ప్రశాంతంగా ఉండి తరగతులు, పరీక్షలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు.పుకార్లు, ప్రతికూల సందేశాలను నమ్మకూడదని విద్యార్థులు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
ఓఎస్డీ నియామకంపై దుమారం
భైంసా: బాసర ట్రిపుల్ ఐటీలో ఓఎస్డీని పరిపాలనా అధికారిగా కొనసాగించడంపై వివాదం నెలకొంది. ఈ అంశంపై తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ (టీఎస్‌ఎస్) ప్రతినిధులు సోమవారం వీసీ గోవర్ధన్‌కు వినతిపత్రం అందజేశారు. ఓఎస్డీ ఎం.మురళీ దర్శన్‌ను పరిపాలనా అధికారిగా కొనసాగించడంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశా రు. ప్రస్తుతం ఓఎస్డీగా ఉన్న వ్యక్తి పరిపాలనా అధికారిగా వ్యవహరిస్తున్నారని, ఇది ఏ చట్టబద్ధ నిబంధనల ప్రకారం జరిగిందో వెల్లడించాలని కోరారు. పరిపాలనా అధికారిగా నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను బహిరంగంగా వెల్లడించాలని, నియామక ప్రక్రియ, చట్టబద్ధ ఆధారంపై స్పష్టత ఇవ్వాలని, విద్యార్థుల ఫిర్యాదులపై స్వతంత్ర విచారణ జరపాలని, నియామకం నిబంధనలకు విరుద్ధమైతే సంబంధిత అధికారి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.


