నిర్మల్‌ఖిల్లా: వేల సంవత్సరా లుగా ఆధ్యాత్మిక శోభతో వెలుగుతున్న నిర్మల్ జిల్లా కేంద్రంలోని గండిరామన్న రాతి గుట్టపై సుమారు 11 నుంచి 13వ శతాబ్దపు కాకతీయుల కాలంనాటి వీరగల్లు శిల్పాన్ని గుర్తించినట్లు జిల్లాకు చెందిన కవి, చరిత్ర పరిశోధకుడు తు మ్మల దేవరావు తెలిపారు. ఈ శిల్పంలో వీరుని చేతిలో ఖడ్గం, డాలు ఉన్నాయి. గండి రామన్నగుట్ట పూర్తిగా పెద్దపెద్ద రాళ్లు, గుహలతో కూడుకుని ఉంటుంది. సముద్ర మట్టానికి సుమారు 300 అడుగుల ఎత్తులో లోతైన గుహలో శివలింగం, నంది, సర్పం, ఉమామహేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. సాధారణంగా యుద్ధంలో మరణించిన వీరుని స్మారకంగానో లేదా గ్రామ రక్షణకోసం పోరాడిన వీరుని గుర్తుగా వీరగల్లు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
16వ శతాబ్దానికి పూర్వమే ఆలయ నిర్మాణం
లక్ష్మణచాంద: మండలంలోని బాబాపూర్‌లో ఉన్న శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం క్రీస్తుశకం 16వ శతాబ్దానికి పూర్వమే నిర్మించారని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్‌కుమార్, పరిశోధక విద్యార్థి రాజశేఖర్ తెలిపారు. సోమవారం ఆలయాన్ని సందర్శించారు. ఇది త్రికూటాలయమని, కదలీకరణ పద్ధతిలో నిర్మాణం జరిగిందన్నారు. ఆలయ ప్రాంగణంలో కాలభైరవునిగా కొలువబడుతున్న వీరగల్లు శిల్పులచే అద్భుతంగా చెక్కబడిందన్నారు. ఇది వీరుని స్మారకంగా శిల్పులు చెక్కే విగ్రహమన్నారు.


