మంచిర్యాలటౌన్: క్రీడల ద్వారానే శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని, విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు క్రీడలు ఉపశమనాన్ని కలిగిస్తాయని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీఉషోదయ పాఠశాల మైదానంలో శనివారం ఆదిలాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, శ్రీనివాస్‌రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీలతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుందని, ఒక్కోసారి నిర్ణీత పనివేళలను మించి పనిచేయాల్సి ఉంటుందన్నా రు. కార్యాలయాల్లో పని ఒత్తిడి దృష్ట్యా శారీరక శ్రమ లేకుండా పని చేయడంతో 40ఏళ్ల వయస్సుకే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉద్యోగులకు శారీరక శ్రమ తప్పనిసరిగా ఉండాలని, నిత్య జీవితంలో వ్యాయామం ఒక భాగంగా పాటించాలన్నారు. అనంతరం కలెక్టర్, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.


