సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అడవుల్లో వన్యప్రాణుల వేట ఆగడం లేదు. యథేచ్ఛగా షికారీ సాగుతోంది. తాజాగా దండేపల్లి మండలం తాళ్లపేట రేంజ్ మామిడిపల్లి బీట్ అటవీ ప్రాంతంలో చిరుతపులిని ఉచ్చు బిగించి హతమార్చారు. కళేబరాన్ని కా ల్చివేశారు. ఈ ఘటనలో అటవీ అధికారులు ము గ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద చిరుతపులి గోర్లు, దంతాలు, మీసాల వెంట్రుకలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇదే తరహాలో పెద్దపులిని చంపిన ఘటనలోనూ వేటగాళ్లు పట్టుబడ్డారు. ఇటీవల పలు చోట్ల వన్యప్రాణులను వేటాడుతూ అధికారులకు చిక్కారు. జిల్లాలో మంచిర్యాల, చెన్నూర్, జన్నారం డివిజన్లలో ఇప్పటికీ అడవుల్లో వన్యప్రాణులను వేటాడుతున్నారు. ఇటీవల వేమనపల్లి మండలం నీల్వాయిలో అడవి పందిని హతమార్చిన ఘటనలో కేసు నమో దు చేశారు. ఇంకా పలు చోట్ల పట్టుబడుతూనే ఉన్నారు. అడవుల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని చె బుతున్నా చిరుతపులుల వంటి జంతువులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. జంతువులనే కాకుండా కొన్ని చోట్ల పక్షులను సైతం వేటాడుతున్నారు.
వేసవిలో మరింత అధికం
వేసవిలో వన్యప్రాణులు అడవి దాటి బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో కొందరు వేటాడి పట్టుకుంటున్నారు. ఇక నీటికుంటలు, వాగుల వద్ద కాపు కాసి వేటాడుతున్నారు. ఇవేకాక రాత్రి పూట తీగలకు విద్యుత్ సరఫరా చేస్తూ చంపేస్తున్నారు. వేటాడిన వన్యప్రాణుల మాంసాన్ని పట్టణాలకు తరలించి అమ్ముకుంటున్నారు. జిల్లా కేంద్రంతో సహా పట్టణాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రైవేటు కార్యక్రమాలకు ప్రత్యేక వంటకంగా అడవి జంతువుల మాంసం అమ్ముతున్నారు. దీంతో విచ్చలవిడిగా వేటతో అడవుల్లో శాకాహార జంతువుల లభ్యత తగ్గుతోంది. శాకాహార జంతువుల వేటతో వాటిపై ఆధారపడే పులులు, చిరుతలు, ఇతర మాంసాహార వన్యప్రాణులకు ఆహారం దొరకడం లేదు. ఈ క్రమంలో అడవి సమీపంలో ఉన్న పశువులు, మేకలు, గొర్రెలపై దాడులు చేస్తున్నాయి. చనిపోయిన వాటికి అటవీ శాఖ రూ.లక్షల్లో పరిహారం చెల్లించాల్సి వస్తోంది. ఓ వైపు వేటగాళ్ల కారణంగా వన్యప్రాణులకు రక్షణ లేకపోగా, మరోవైపు అడవుల్లో జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది.
పొంచి ఉన్న ముప్పు
విచ్చల విడిగా వేటతో వన్యప్రాణులకు ప్రాణముప్పు పొంచి ఉంది. అక్రమ కలప రవాణా, పోడుతో అడవుల్లో వన్యప్రాణులకు రక్షణ మరింత కష్టంగా మారుతోంది. ఈ ప్రభావం స్వేచ్ఛగా సంచరించే వన్యప్రాణులపై పడుతోంది. విద్యుత్ తీగలతో వేటాడం వల్ల తీవ్రంగా నష్టం జరుగుతోంది. కొన్నిసార్లు విద్యుత్ తీగలకు మనుషులు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. అయినప్పటికీ పంట చేన్లు కాపాడుకునే సమయంతోపాటు వన్యప్రాణుల వేట కోసం విద్యుత్ తీగలనే వాడుతున్నారు. దీంతో అనేక జంతువులు మృత్యువాత పడుతున్నాయి. అటవీ సమీప గ్రామాల్లో కొందరికి వేటాడం నిత్యకృత్యంగా మారింది. అడవుల్లో సీసీ కెమెరాలు, చెక్‌పోస్టులు, రాత్రి పూట గస్తీ సిబ్బంది ఉన్నప్పటికీ వేటను పూర్తిగా అదుపులోకి తేలేకపోతున్నారు. కొన్ని రేంజ్‌ల్లో సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంతోనూ ముప్పు వాటిల్లుతోంది.


