జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా మూడు ఎంపిక
ఐఐటీ, నీట్, క్లాట్‌కు ప్రత్యేక శిక్షణ
చేరికకు ప్రవేశ పరీక్ష నిర్వహణ
ఈ నెల 16నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
మిగతా విద్యాలయాల్లో నేరుగా ప్రవేశాలు
మంచిర్యాలఅర్బన్: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు బాలికలకు బాసటగా నిలుస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమంలో బోధన, వసతులతో కూడిన విద్య వారికి వరంగా మారాయి. జిల్లాలో 18 కేజీబీవీ(కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా)లు ఉండగా.. 15చోట్ల ఇంటర్, మూడింటిలో ఆరు నుంచి పదో తరగతి వరకు కొనసాగుతున్నాయి. 4640 మంది బాలికలు విద్యనభ్యసిస్తుండగా.. 241మంది ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు. ఆరు నుంచి పదో తరగతి వరకు నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. తాజాగా ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ఐఐటీ, నీట్, క్లాట్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.
మూడు ఎంపిక
జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, తాండూర్ కేజీబీవీలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(వైఐఐఓఈ)గా మార్చారు. మంచిర్యాలలో ఐఐటీ, బెల్లంపల్లిలో నీట్, తాండూర్‌లో క్లాట్‌కు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ తీసుకోలేని పరిస్థితి, రూ.లక్షలు ఖర్చు చేసే ఆర్థిక స్థోమత లేని దృష్ట్యా ఎంపిక చేసిన విద్యాలయాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మూడు విద్యాలయాల్లోని ఇంటర్ ప్రథమ సంవత్సరం(2026–27) గాను అడ్మిషన్లు స్వీకరించనున్నారు. ఇందులో చేరికకు విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మార్చి 2026లో పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థినులు ఈ నెల 16నుంచి ఏప్రిల్ 15వరకు ఆన్‌లైన్‌లో www.tgrjc.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష మే 3న టీజీఆర్‌జేసీ సీఈటీ–2026 ద్వారా నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రతిభావంతులకు ఆయా విద్యాలయాల్లో అవకాశం కల్పిస్తారని డీఈవో యాదయ్య తెలిపారు. కాగా, మిగతా కేజీబీవీల్లో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు.


