మంచిర్యాలటౌన్: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తుండగా.. ఇకపై శుద్ధమైన జలం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాకు 79 ఆర్వో ప్లాంట్లు మంజూరు చేశారు. జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 974 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో స్వంత భవనాలు 182 ఉండగా, ఉచిత అద్దె భవనాలు 309, అద్దె చెల్లిస్తున్నవి 483 ఉన్నాయి. ప్రస్తుతం స్వంత భవనాలు ఉండి, నల్లా కనెక్షన్ ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధమైన తాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్‌లో ప్రతీ కేంద్రంలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటితోపాటు చిన్నారులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రతీ అంగన్‌వాడీ కేంద్రంలో విద్యుత్ సరఫరాతో ఫ్యాన్ల ఏర్పాటుకు అవకాశం ఉండగా.. వేసవిలో చిన్నారులకు ఉక్కపోత ఇబ్బందులు తొలగనున్నాయి. స్వంత భవనాలు ఉన్నచోట్ల ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్‌ఖాన్ తెలిపారు.
జిల్లాలో
అంగన్‌వాడీ కేంద్రాలు 974
ఆర్వోప్లాంట్లు మంజూరు 79
చిన్నారులు 29,635
గర్భిణులు 3,307
బాలింతలు 3,543


