మంచిర్యాలఅర్బన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. 48 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 99.72శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం 9.30గంటల నుంచి 12.30గంటల వరకు ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు, ఉర్దూ, హిందీ) పరీక్షలు నిర్వహించారు. రెగ్యులర్ విద్యార్థులు 9,682 మందికి గాను 9,655 మంది హాజరు కాగా, 27 మంది గైర్హాజరయ్యారు. గతంలో ఒక్కసారి ఫెయిలైన విద్యార్థులు ఏడుగురికి గాను ఐదుగురు హాజరు కాగా ఇద్దరు రాలేదు. పరీక్ష నిర్ణీత సమయానికి గంట ముందే విద్యార్థులు, తల్లిదండ్రులు కేంద్రాలకు చేరుకున్నారు. గది నంబరును సరిచూసుకున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కేంద్రాల్లోకి అనుమతించారు. చీఫ్ సూపరింటెండెంట్లు 48 మంది, డిపార్టుమెంటు అధికారులు 48మంది, సిట్టింగ్‌స్క్వాడ్ బృందాలతోపాటు 460మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించారు. కేంద్రాల్లో ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచారు. ప్రతీ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తనిఖీ అధికారులు, స్వ్వాడ్ ఫోన్లు బయటపెట్టారు. జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్, ఐదు కేంద్రాలను డీఈవో యాదయ్య పరిశీలించారు.


