● కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు ● కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎల్‌పీజీ సిలిండర్లు సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్‌లో డీసీపీ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రావు, ఏసీపీ ప్రకాష్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎల్‌పీజీ డీలర్లతో సమావేశం నిర్వహించి జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి సమీక్షిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో అవసరానికి సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, బుకింగ్, నిల్వలపై సమీక్షిస్తున్నామని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలు, గోదాములు వద్దకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు. గ్యాస్ డెలివరి సమయంలో ఓటీపీ చెప్పి సహకరించాలని, హోటల్, రెస్టారెంట్లలో వాణిజ్య సిలిండర్ మాత్రమే ఉపయోగించుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్యాస్ సిలిండర్లు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తే నిత్యావసరాల చట్టం 1955 కింద చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎల్‌పీజీ వినియోగదారులు కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని, గ్యాస్ ఏజెన్సీ వద్ద ఆన్‌లైన్, నిర్వాహకులు, గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ యాప్‌లో పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.


