జిల్లాలో సమగ్ర జనాభా లెక్కల సేకరణ
వచ్చే మేలో ఇంటింటికీ ఎన్యుమరేటర్లు
తహసీల్దార్లు, ఎంపీడీవో, కమిషనర్లకు శిక్షణ
2011తో పోలిస్తే 2026వరకు భారీగా పెరగనున్న జనాభా
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జనగణనకు అంతా సిద్ధమవుతోంది. గత కొన్నేళ్లుగా వాయిదా పడుతున్న జనాభా లెక్కల సేకరణ వచ్చే మే నెలలో మొదలు కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం 2011లో చేపట్టిన జనాభా లెక్కలే ఇప్పటికీ జిల్లా జనాభాకు ప్రామాణికంగా మారాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలన పేరుతోనూ సామాజిక, ఆర్థిక, కుల గణన చేపట్టారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, దేశాభివృద్ధి, లోటుపాట్లపై ప్రణాళికలు రూపొందించాలంటే జనాభాపై స్పష్టత ఉండాలి. అలాగే ఆయా వర్గాల్లో అర్హులకు ప్రాయోజితాలు దక్కాలన్నా ఈ జనాభా వివరాలే కీలకం ఈ క్రమంలో జనగణనకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే అంతా సిద్ధం చేసింది. జిల్లాలోనూ ఈ మేరకు గత మూడు రోజులుగా శిక్షణ జరుగుతోంది. మండల పరిధిలో తహసీల్దార్లు, ఎంపీడీవో, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లకు శిక్షణ ఇచ్చారు.
రెండు దశల్లో వివరాల సేకరణ
రెండు దశల్లో జరగనున్న ఈ గణనలో ఎన్యుమరేటర్లు మొదట ప్రతీ యూనిట్(కుటుంబాలు)లను లెక్కిస్తారు. ప్రతీ వంద కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున నియమించనున్నారు. వేసవి సెలవులు పూర్తయితే ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు ఎన్యుమరేటర్లుగా వివరాలు సేకరించనున్నారు. రాష్ట్రంలో మే 11నుంచి జూన్ 9వరకు ఇళ్లు, కుటుంబాల వివరాల సేకరించనున్నారు. ఇక రెండో దశలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టనున్నారు. జననాలను మార్చి ఒకటి నుంచి కటాఫ్‌గా తీసుకుని నమోదు చేయనున్నారు. 33అంశాలతో కూడిన ప్రశ్నావళిని ఎన్యుమరేటర్లు జిల్లాలో ప్రతీ ఇంటి నుంచి వివరాలు తీసుకోనున్నారు. ఇంటి రకం నుంచి మొదలు సౌకర్యాలు, సామాజిక స్థితిని ప్రతిబింబించే పలు ప్రశ్నలతో కూడిన అంశాలను అడిగి నమోదు చేస్తారు.
అంతా డిజిటల్, సెల్ఫ్ ఎన్యుమరేషన్
ఈసారి జనగనణలో పూర్తిగా పేపర్ లెస్‌గా ప్రత్యేక పోర్టల్‌లో ఎన్యుమరేటర్లు ట్యాబ్‌లతో నమోదు చేయనున్నారు. పూర్తిగా డిజిటల్‌గా పద్ధతిలో వివరాలు సేకరించనున్నారు. ఇక పౌరులు సైతం సొంతంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. సెన్సస్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లోకి వెళ్లి నేరుగా వివరాలు పొందుపర్చవచ్చు. మొబైల్ నంబరుతో లాగిన్ అయి పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లోనే నమోదు చేయొచ్చు. లేకపోతే ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు పూర్తిగా వివరాలైన వెల్లడించాలి.
జనాభా లెక్కలే కీలకం
కేంద్రం ప్రతీ పదేళ్లకోసారి నిర్వహిస్తున్న జనాభా లెక్కలే అత్యంత ప్రామాణికం. ఈ లెక్కింపుతో సీ్త్ర, పురుష, లింగ నిష్పత్తి, బాల, బాలికలు, అక్షరాస్యత, ఆర్థి క స్థితి, సామాజిక స్థితిగతులు సైతం తెలుస్తాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ, ఈబీసీ, మహిళలకు అవకాశాల కోసం రిజర్వేషన్లు, పథకాల అమలు లెక్కల ఆధారంగా ఉంటుంది. 2021లోనే గణన చేపట్టాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. తర్వాత లోక్‌సభ ఎన్నికలు తదితర కారణాలతో వాయిదా పడుతూ చివరకు ఈ ఏడాదిలో గణనకు కసరత్తు పూర్తయింది. తమ పూర్తి వివరాలు తెలియజేస్తే దేశపురోగతికి తోడ్పడుతుందని, అందరూ నిజాలే చెప్పాలని అధికారులు కోరుతున్నారు.
2011లో చివరగా జనాభా లెక్కలు జరగగా మళ్లీ 15ఏళ్ల తర్వాత జరుగుతున్నాయి. ఈ క్రమంలో గ్రామాలు, పట్టణాల్లో జనాభా పెరగనుంది. జిల్లా కేంద్రం మంచిర్యాల నగరంలోనే రెండు లక్షలకుపైగా జనాభా ఉండగా, మిగతా పట్టణాల్లో 50వేల నుంచి లక్ష వరకు జనాభా ఉండనుంది. ఇక మేజర్ గ్రామ పంచాయతీలు, చిన్న పంచాయతీల్లోనూ గడిచిన పదిహేనేళ్లలో జనన, మరణాలు పెరిగాయి. ఈ క్రమంలో జనాభా పది లక్షలు దాటే అవకాశం ఉన్నట్లు అంచనా ఉంది.


