విద్యార్థులూ.. విజయీభవ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులూ.. విజయీభవ

Mar 14 2026 7:25 AM | Updated on Mar 14 2026 7:25 AM

● నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ● ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ● హెల్ప్‌లైన్‌ నంబర్లు 94409 67015, 94406 88034

మంచిర్యాలఅర్బన్‌: పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈసారి పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ఇస్తారు. అంతకుమించితే మాత్రం పరీక్ష రాసే వీలుండదు. జిల్లాలో 48 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా 9703మంది పరీక్షలకు హాజరు కానుండగా.. వీరిలో 4896 మంది బాలురు, 4807 మంది బాలికలు ఉన్నారు. ఎనిమి ది పరీక్షలకు 33రోజుల వ్యవధి ఉంది. మార్చి 14, 18, 23, 28, ఏప్రిల్‌ 2, 7, 13న పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఎస్‌ఈ తరహాలో మొదటిసారిగా ఒక్కో పరీక్షకు మూడు నాలుగు రోజుల విరామం వస్తోంది. దీంతో విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం ఏర్పడింది. హాల్‌టికెట్‌పై ముద్రించిన క్యూర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా తెలుసుకోవచ్చు. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

నిఘా..

ప్రతీ పరీక్ష కేంద్రంలో తాగునీరు, వైద్య సిబ్బందితోపాటు మందులు అందుబాటులో ఉంచుతున్నారు. ఫర్నిచర్‌, డ్యుయల్‌ డెస్క్‌లు, ఫ్యాన్లతోపాటు సౌకర్యాలు కల్పించారు. ప్రతీ కేంద్రంలో సీఎస్‌ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిఘా కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నపత్రాలు తెరవడం, జవాబు పత్రాలు సీల్‌ వేయడం చేస్తారు. ప్రతీ కేంద్రంలో సిట్టింగ్‌ స్క్వాడ్‌, విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు బృందంతోపాటు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఎప్పటికప్పుడు కేంద్రాలను సందర్శిస్తుంది.

వాట్సాప్‌లో హాల్‌టికెట్లు

ఈసారి మూడు రకాలుగా హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. ప్రింటెడ్‌ హాల్‌టికెట్లు పాఠశాలల్లో పంపిణీ, ఎస్సెస్సీ బోర్డు వెబ్‌సైట్‌ bse.te langana.gov.in ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వాట్సాప్‌ 80969 58096 వాట్సప్‌ నంబరుకు జిజీ సందేశం పంపిన తర్వాత hall ticket march 2026 అని పంపాలి. విద్యార్థి వివరాలు నమోదు చేసి హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

గంట ముందే చేరుకోవాలి

పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష సమయానికి గంట ముందే విద్యార్థులు కేంద్రానికి చేరుకోవాలి. మొబైల్‌ఫోన్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు అనుమతి లేదు. ప్రశ్నపత్రం జాగ్రత్తగా చదివి సమాధానాలు రాయాలి. ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలి. విద్యార్థుల సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్‌ నంబర్లు 94409 67015, 94406 88034లో సంప్రదించవచ్చు. – యాదయ్య, డీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement