మంచిర్యాలఅగ్రికల్చర్: వంటింట్లో ధరల మంట మండుతోంది. గ్యాస్ ధరలకు రెక్కలు రాగా.. వంటనూనెలు, పప్పుల ధరలు ఒక్కసారిగా పెరిగి వినియోగదారులపై పెనుభారం పడుతోంది. గత నెల రోజులుగా విదేశాల నుంచి వంటనూనె, పప్పుదినుసుల దిగుమతులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. గత నెలలో పొద్దు తిరుగుడు నూనె ప్యాకెట్ ధర రూ.145 నుంచి రూ.150 మధ్య ఉండగా.. ఈ వారంలో రూ.165 నుంచి రూ.180కి చేరింది. పామాయిల్ ధర రూ.140 నుంచి రూ.160కి పెరిగింది. పల్లిలు కిలో రూ.125 నుంచి రూ.135 ఉండగా ప్రస్తుతం రూ.175 నుంచి రూ.180కి చేరింది. కందిపప్పు రూ.120 నుంచి రూ.130 ఉండగా.. రూ.140 నుంచి రూ.150కి చేరింది. హోల్‌సేల్ దుకాణాల్లో ఇలా ఉంటే రిటెయిల్, గ్రామాల్లోని దుకాణాల్లో నూనె ప్యాకెట్, కిలో పప్పులపై మరో రూ.5 నుంచి రూ.10వరకు పెంచి విక్రయిస్తున్నారు. ధరలు పెరుగుతుండడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలతో జిల్లా ప్రజలపై రూ.4.30కోట్ల మేర భారం పడుతోంది. గ్యాస్ ధరలు, ఇటు వంటనూనె, పప్పుల ధరలు ౖపైపెకి చేరడంతో దినసరి కూలీ జేబు ఖాళీ అవుతోంది. ఇతర దేశాల దిగుమతులు తగ్గిపోవడంతో ధరలు పెరిగిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడడంతో కొందరు ముందస్తుగా నిల్వ చేసుకుంటున్నారు. ఇదే అదునుగా భావించి కొంత కృత్రిమ కొరత సృష్టించి కూడా ధరలు పెంచుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే గ్యాస్ ధర పెరుగగా.. వంటనూనెలు, పప్పుల ధరలు పెరగడంతో సామాన్యుడితోపాటు హోటళ్ల నిర్వాహకులపై తీవ్ర ప్రభావం పడుతోంది. యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.


