నస్పూర్: ఈ నెల 16నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో బీసీల సంక్షేమానికి రూ. 50 వేల కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సమితి ఆధ్వర్యంలో గురువారం సీసీసీ కార్నర్‌లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేశారు. హామీ విస్మరించి మొదటి బడ్జెట్ సమావేశాల్లో రూ.9వేల కోట్లు, రెండో బడ్జెట్ సమావేశాల్లో రూ.11 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టడం బీసీలకు అన్యాయం చేయడమేనని విమర్శించారు. 56శాతం జనాభా ఉన్న బీసీలకు అరకొర నిధులు కే టాయిస్తే వారి ఆర్థికాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అత్యధిక పన్నులు చెల్లించేది బీసీ లేనని చెప్పారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో బీసీ లకు రూ.50వేల కోట్లు కేటాయించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు గజెల్లి వెంకటయ్య, వేముల అశోక్, చంద్రగిరి చంద్రమౌళి, అంకం సతీశ్ తదితరులు పాల్గొన్నారు.


