నేరడిగొండ: మండలంలోని బోరిగాం గ్రామంలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా క్షణాల్లోనే మంటలు చెలరేగా యి. ఈ ప్రమాదంలో మూడు నివాస గృహాలతో పాటు రెండు పశువుల కొట్టాలు దగ్ధమయ్యాయి. ఇళ్లలో ఉన్న నిత్యావసర వస్తువులు, నగదు, ధాన్యం, ఇతర విలువైన సామగ్రి పూర్తిగా కాలిబూడిదయ్యాయి. గ్రామస్తులు మంటలార్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే కాలిపోయాయి. ఇచ్చోడ నుంచి ఫైరింజన్ ఘటన స్థలానికి చేరుకుని గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ ప్రమాదంలో జాదవ్ ప్రేమ్‌సింగ్, జాదవ్ సుందర్, జాదవ్ అంబర్‌సింగ్ నివాస గృహాలు అగ్నికి ఆహుతయ్యాయి. అలాగే జాదవ్ రెడ్డియా, రాథోడ్ బిక్కులాల్‌కు చెందిన పశువుల కొట్టాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.20 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


