చెనూరు: జైపూర్ మండలం ఇందారం ఐకే–1ఏ, ఐకే–ఓసీపీలో ప్రోగ్రెసివ్ మైన్‌క్లోజర్ కార్యక్రమంలో భాగంగా వోఎస్‌డీ(సీసీవో,ఎంవోసీ) కృష్ణమోహన్ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ బృందం గురువారం పర్యటించింది. మైన్‌క్లోజర్ పనులు పరిశీలించి గనుల తవ్వకం పూర్తయిన ప్రదేశాల్లో మట్టి నింపడం, చెట్లు నాటడం వంటి చర్యల ద్వారా పర్యావరణహితంగా పునరుద్ధరించే కార్యక్రమాలు అమలు చేస్తున్న తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. ఐకే–గ్రూప్ ఏజెంట్ ఏవీ.రెడ్డి గనుల పరిసరాలను బృందానికి వివరించారు. అంతకుముందు శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్.. వోఎస్‌డీ కృష్ణమోహన్‌ను సన్మానించారు. కార్పొరేట్ పర్యావరణాధికార విభాగం అదనపు మేనేజర్లు తిరుపతి, శంకర్, బాబ్జీలు, కార్పొరేట్ ఎస్‌ఎస్‌వో యాదగిరి, డీజీఎం ఫారెస్టు హరినారాయణ, ఐకే–ఓసీపీ మేనేజర్ నాగన్న, కోటయ్య, పర్యావరణాధికారి హన్‌మాన్‌గౌడ్ తదితరులు ఉన్నారు.


