ట్రిపుల్ ఐటీలో దుస్థితి ఆరేళ్లుగా ఇవ్వని ప్రభుత్వం ఇంజినీరింగ్‌లోనూ అదే పరిస్థితి ప్రాక్టికల్స్ లేక పరీక్షల్లో ఫెయిల్ అవుతున్న విద్యార్థులు
భైంసా: గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బాసరలోని ట్రిపుల్‌ఐటీ ప్రస్తుతం సమస్యల గూడంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక విద్యకు ప్రతీకగా నిలవాల్సిన ఈ విద్యాసంస్థలో విద్యార్థుల చేతుల్లో పుస్తకాలే తప్ప, వారి చదువుకు అవసరమైన ల్యాప్‌టాప్‌లు కనిపించడం లేదు. ఇంజినీరింగ్ మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న సుమారు 3 వేల మందికి ఇప్పటివరకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వకపోవడంతో వారి భవిష్యత్తుపై ప్రశ్నార్థకంగా మారింది.
విద్యార్థులకు కలగానే..
గతంలో పదో తరగతి అనంతరం ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొందిన వెంటనే పీయూసీ చదువుతున్న విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేసే విధానం ఉండేది. కానీ గత ఆరేళ్లుగా ఆ సంప్రదాయం నిలిచిపోయింది. కనీసం ఇంజినీరింగ్‌లోకి వచ్చిన తర్వాత అయినా ల్యాప్‌టాప్‌లు అందుతాయని ఆశించిన విద్యార్థులకు అది కలగానే మిగిలింది. ఇంజినీరింగ్ విద్యలో కీలకమైన కోడింగ్, డిజైనింగ్, ప్రోగ్రామింగ్ వంటి అంశాలను కంప్యూటర్ లేకుండానే నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాక్టికల్స్ చేయడానికి అవకాశం లేకపోవడంతో అనేక మంది పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రశ్నిస్తే వేధింపులు
యూనివర్సిటీకి వచ్చే మంత్రులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని విద్యార్థులు చెబుతున్నారు. తమ సమస్యలను బయటకు చెబుతున్న వారిపై అధికారులు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమస్యలపై ప్రశ్నించిన విద్యార్థులను వేధిస్తున్నారని, ఈ విషయమై మంత్రులు, మానవ హక్కుల సంఘానికి ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు పేర్కొంటున్నారు. రెండేళ్లలో ఇంజినీరింగ్ పూర్తి చేసి బయటకు వెళ్లాల్సిన విద్యార్థులు కనీసం కంప్యూటర్ మౌస్ పట్టుకోకుండా డిగ్రీలు పూర్తిచేసి వెళ్తేవారికి ఉద్యోగాలు ఎలా వస్తాయని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గ్రామీణప్రాంతాల నుంచి పెద్ద ఆశలతో వచ్చిన పేద విద్యార్థులు ఇలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం చాలా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీలో ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే నిధులు విడుదల చేసి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
పంపిణీకి నిధుల కొరత సాకు!
ల్యాప్‌టాప్‌ల పంపిణీకి నిధుల కొరతను సాకుగా చూపుతున్న అధికారులు పీయూసీ విద్యార్థుల కోసం నామమాత్రంగా ఒక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. 3,300 మంది విద్యార్థులు ఉన్న విభాగంలో కేవలం వంద నుంచి రెండు వందల డెస్క్‌టాప్ కంప్యూటర్లను మాత్రమే ఉంచడం వారిలో అసంతృప్తిని కలిగిస్తోంది. కంప్యూటర్ ఉపయోగించేందుకు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోందని వారు చెబుతున్నారు.
మరో రెండునెలల్లో ల్యాప్‌టాప్‌లు
ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మరో రెండు నెలల్లో ల్యాప్‌టాప్‌లు అందజేస్తాం. పీయూసీ విద్యార్థుల కోసం ప్రస్తుతం ల్యాబ్‌లో 1,250 ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.
– వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్


