మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలో ప్రభుత్వం పీఆర్టీయూ సంఘానికి కేటాయించిన స్థలంలో పాగా వేసి బెదిరింపులకు పాల్పడినంత మాత్రాన స్థలాన్ని వదులుకుంటామా అని కబ్జాదారులను పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం జిల్లా కేంద్రంలోని సర్వేనంబర్ 426లో 2004 అప్పటి ప్రభుత్వం కేటాయించిన 484 గజాల భూమిని ఓ కార్పొరేటర్ కబ్జాకు పాల్పడుతున్న విషయం తెలుసుకుని హుటాహుటిన మంచిర్యాలకు చేరుకున్నారు. జిల్లాకు చెందిన టీచర్లతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. కబ్జాకు యత్నించిన విషయమై మేయర్ ధర్ని మధుకర్, డీసీపీ భాస్కర్‌ను వేర్వేరు కలిసి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు యత్నించడం, జిల్లా నాయకత్వాన్ని బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో కబ్జాదారులు వెనుదిరిగినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బిక్షమయ్యగౌడ్, ఆడిట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగ మహేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొట్టే శంకర్, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
డీసీపీని కలిసి వివరిస్తున్న శ్రీపాల్‌రెడ్డి, తదితరులు


