మంచిర్యాలరూరల్(హాజీపూర్): కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో ఆ ప్రభావం హోటళ్లపై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే బెంగళూర్, చెన్నయ్ మహానగరాల్లో హోటళ్ల బంద్ చేస్తుండగా.. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాలపైనే కాకుండా ఇప్పుడు మంచిర్యాల తదితర ప్రధాన పట్టణాల్లో కూడా హోటళ్ల బంద్‌కు దారి తీసింది. మంగళవారం కమర్షియల్ సిలిండర్ల కొరతతో మంచిర్యాలలో చాలా వరకు హోటళ్లు నడపలేక బంద్ చేశారు. అమెరికా, ఇరాన్ యుద్ధ ప్రభావం ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాపై పడింది. గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో బుధవారం నుంచి హోటళ్ల బంద్‌పై తీవ్ర ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. భోజనప్రియులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి, వ్యాపార నిమిత్తం రాకపోకలు సాగించే వారితోపాటు ముఖ్యంగా ఆస్పత్రులకు వచ్చే వారికి ఆకలి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆకలి తీర్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు.


