మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా వ్యవసాయ కార్యాలయంలోని అటెండర్ ఆత్మహత్యకు యత్నించడం కలెక్టరేట్‌లో మంగళవారం కలకలం రేపింది. అధికారులు, సహచర సిబ్బంది అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కలెక్టరేట్‌లోని జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో బొల్లి శ్రీనివాస్ అటెండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సోమవారం రాత్రి 9.30గంటల వరకు కార్యాలయంలోనే ఉండి వెళ్లాడు. మంగళవారం ఉదయం 10గంటలకు జిల్లా వ్యవసాయ అధికారి(డీఏవో) కార్యాలయానికి వచ్చి అతడికి ఫోన్ చేసి ఆఫీసు తాళం తీయలేదని ప్రశ్నించారు. తాను టప్ప కోసం పోస్టాఫీసుకు వెళ్లాలని, మరో అటెండర్ తాళం తీస్తుందని చెప్పానని శ్రీనివాస్ తెలిపాడు. ఎవరూ తీయలేదంటూ ఆమె ఆవేశంగా ఫోన్ కట్ చేయడంతోపాటు కార్యాలయానికి వచ్చిన తర్వాత ఇంతసేపు ఎక్కడికి వెళ్లావంటూ దుర్భాషాలాడిందని తెలిపాడు. కార్యాలయంలో పని, కార్యాలయానికి సంబంధించిన బయట పని చేయాల్సి వస్తోందనే ఒత్తిడి, గత కొంతకాలంగా అధికారి వేధింపులతో మానసిక క్షోభకు గురి చేస్తుండడంతో తట్టుకోలేక నమూనాల కోసం కార్యాలయానికి తీసుకొచ్చిన గడ్డి, చెదల నివారణ మందు తాగాడు. వెంటనే డీఏవో, సహచర సిబ్బంది 108అంబులెన్స్‌లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. సీసీసీ నస్పూర్ ఎస్సై ప్రశాంత్ బాధితుడి వాంగ్మూలం సేకరించారు. ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు.
వేధింపులకు గురి చేయలేదు
మంగళవారం ఉదయం 10గంటలకు కార్యాలయానికి వస్తే తాళం వేసి ఉండడంతో అటెండర్‌కు ఫోన్ చేశాను. ఇద్దరు అటెండర్లు ఉన్నా నేనే తాళం తీసుకోవాల్సి వచ్చింది. విధులు సక్రమంగా నిర్వర్తించాలని అన్నందుకే అలా చేశాడు. అప్పుడప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాత్రి సమయం వరకు కూడా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే వారు కూడా ఉండాల్సి వస్తోంది. నేను ఎలాంటి వేధింపులకు గురి చేయలేదు.
– సురేఖ, జిల్లా వ్యవసాయ అధికారి
అటెండర్ శ్రీనివాస్


