చెన్నూర్‌రూరల్: జిల్లాలోని రైతులు యాసంగి సీజన్‌లో కూరగాయల సాగువైపు దృష్టి సారిస్తున్నా రు. పెట్టుబడి తక్కువ, కొద్ది రోజుల్లోనే పంట చేతికి అందిరావడంతో పాటు లాభాలు కూడా అధికంగానే ఉంటోంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది యా సంగి సీజన్‌లో రైతులు సుమారు వెయ్యికి పైగా ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. చెన్నూర్ మండలంలోని కత్తెరసాల, సుద్దా ల, శివలింగాపూర్, సుబ్బరాంపల్లి, కిష్టంపేట, అంగ్రాజ్‌పల్లి, దుగ్నెపల్లి, చింతలపల్లి, అక్కెపల్లి, ఆస్నాద, తదితర గ్రామాల్లోని రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. ఒక్కో రైతు 10 గుంటల నుంచి ఎకరం వరకు కూరగాయల సాగుకు కేటాయించారు. అందులో అల్చంత, బెండ, వంకాయ, మిరప, టమాట, గోబీ వంటి కూరగాయలతో పాటు తోటకూర, కొత్తిమీర, పాలకూర, పూదీన, చుక్కకూర లాంటి ఆకుకూరలు సాగు చేస్తున్నారు. మొక్కలకు ప్రతీరోజు ఉదయం బోరుబావుల ద్వారా నీటిని అందిస్తున్నారు. పంటలు వేసినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. రెండు రోజులకు ఒకసారి తోటకూర, బెండ, మిరప, టమాట, వంకాయలు 20 కిలోల నుంచి 30 కిలోల వరకు వెళ్తాయని వాటిని చెన్నూర్ లేదా మంచిర్యాల, గోదావరిఖని మార్కెట్‌లకు తీసుకెళ్లి విక్రయిస్తామని ఆయా గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. కూరగాయలకు మార్కెట్‌లో మంచి ధరలు ఉండడంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు.


