నస్పూర్: సీసీసీ టౌన్‌షిప్ సమీపంలోని 363 జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ రూప్నార్ అర్జున్ (35) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై మేకల ప్రశాంత్ తెలిపిన వివరాల మేరకు జాతీయ రహదారికి సంబంధించిన వాటర్ ట్యాంకర్ డ్రైవర్ అజ్మీరా శంకర్ వాహనాన్ని నెమ్మదిగా నడుపుకుంటూ వెళ్తుండగా వెనకాల పైపుతో డేగ రాయమల్లు అనే వర్కర్ చెట్లకు నీళ్లు పడుతున్నాడు. ఈ క్రమంలో బెల్లంపల్లి నుంచి శ్రీరాంపూర్ వైపు అతివేగంగా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ వాటర్ ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. దీంతో వాటర్ ట్యాంకర్ పల్టీ కొట్టి రోడ్డు పక్కకు పడిపోయింది. ఆయిల్ ట్యాంకర్ ముందు భాగం నుజ్జునుజ్జు అయి డ్రైవర్ అందులోనే ఇరుక్కుని మృతి చెందాడు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు మహారాష్ట్రలోని బీడ్ జిల్లా సిరూర్ తాలుకాకు చెందిన వ్యక్తిగా గుర్తించామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


