● ‘సీఎంఆర్‌’ బకాయిలపై సర్కారు సీరియస్‌ ● ఆర్‌ఆర్‌, క్రిమినల్‌ కేసులతో వ్యాపారుల బెంబేలు ● వడ్డీ, జరిమానాలు మాఫీ చేయాలంటూ వేడుకోలు ● పని లేక రైస్‌మిల్లులు మూతపడుతున్నాయని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

● ‘సీఎంఆర్‌’ బకాయిలపై సర్కారు సీరియస్‌ ● ఆర్‌ఆర్‌, క్రిమినల్‌ కేసులతో వ్యాపారుల బెంబేలు ● వడ్డీ, జరిమానాలు మాఫీ చేయాలంటూ వేడుకోలు ● పని లేక రైస్‌మిల్లులు మూతపడుతున్నాయని ఆందోళన

Mar 10 2026 1:21 PM | Updated on Mar 10 2026 1:21 PM

● ‘సీఎంఆర్‌’ బకాయిలపై సర్కారు సీరియస్‌ ● ఆర్‌ఆర్‌, క్రిమినల్‌ కేసులతో వ్యాపారుల బెంబేలు ● వడ్డీ, జరిమానాలు మాఫీ చేయాలంటూ వేడుకోలు ● పని లేక రైస్‌మిల్లులు మూతపడుతున్నాయని ఆందోళన

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మిల్లర్ల బకాయిలపై సర్కారు కఠినంగా వ్యవహరిస్తుండడంతో డీఫాల్టర్లలో గుబులు మొదలైంది. వడ్లు పక్కదారి పట్టించి సకాలంలో సీఎంఆర్‌(కస్టం మిల్లింగ్‌ రైస్‌) ఇవ్వకుండా తాత్సారం చేశారనే కారణంతో మరిన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే డీఫాల్ట్‌ మిల్లర్లపై ఆర్‌ఆర్‌(రెవెన్యూ రికవరీ) యాక్టు, క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఇంకా వారిపై అప్పులు రికవరీ కోసం చట్టపరంగా ముందుకెళ్తున్నారు. మరోవైపు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు చేయడంతో కోర్టుల నుంచి ఉత్తర్వులు పొందారు. ఇటీవల ప్రభుత్వం గత నెల 22వరకు పెండింగ్‌ బియ్యం పౌరసరఫరాల శాఖకు అప్పగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఓ వైపు కేసులతో ఉండగా, మరోవైపు బియ్యం లేదా బ కాయిలు చెల్లించా లని కోరడంతో డీఫాల్ట్‌ మిల్లర్లు తర్జనభర్జన పడుతున్నారు. తమకు బాకీల్లో మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే జిల్లాలో డీఫాల్ట్‌ అయిన మిల్లర్లను బ్లాక్‌ జాబితాలో చేర్చి ధాన్యం ఇవ్వడం నిలిపివేశారు. దీంతో పొరుగున ఉన్న పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాలకు ధాన్యం తరలించారు.

పేరుకుపోతున్న బకాయిలు

ధాన్యం సేకరణ సమయంలో మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం కంటే ప్రస్తుత విలువ మరింత పెరిగింది. 2019నుంచి మొదలు 2023వరకు బియ్యం బాకీలు ఉన్నాయి. మొత్తం విలువలో 25శాతం జరిమానా, ఆపైన 12శాతం వడ్డీ విధించారు. దీంతో ఈ విలువ పెరుగుతూ వస్తోంది. గత కొంతకాలంగా వీటిని మాఫీ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బకాయి పడిన మిల్లర్లు రాష్ట్రమంత్రుల నుంచి పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే బకాయిలు ఉన్న వారిపై సర్కారు నుంచి ఎటువంటి సానుకూల నిర్ణయం రావడం లేదు. మరోవైపు ప్రభుత్వం బకాయి బియ్యం పెట్టడమో, ఆ మొత్తం విలువను పౌరసరఫరాల శాఖకు నగదులో కట్టాలంటూ నోటీసులు పంపుతున్నారు. జిల్లాలో 22మంది మిల్లర్లపై కేసులు నమోదు చేయగా, మొత్తంగా జిల్లాలో రూ.వంద కోట్లకు పైనే బాకీలు ఉన్నాయి.

మాఫీ చేయాలి

డీఫాల్ట్‌ మిల్లర్లపై 25శాతం పెనాల్టీ, 12శాతం వడ్డీ ఎత్తివేయాలని కోరుతున్నాం. ఎంతోమందికి ఉపాధి ఇచ్చే జిల్లాలోని మిల్లులు మూతపడ్డాయి. ఇక్కడ బ్లాక్‌ లిస్టులో పెట్టి ధాన్యం పొరుగు జిల్లాలకు ఇస్తున్నారు. మిల్లులు మళ్లీ నడిచేందుకు ప్రభుత్వం మాకు సహకరించాలి.

– గుంత నాగరాజు, అధ్యక్షుడు,

జిల్లా రా రైస్‌ మిల్లర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌

మూతపడుతున్న మిల్లులు

క్రిమినల్‌ కేసులు, ఈడీ, ఐటీ నోటీసులు

ధాన్యం పక్కదారి పట్టించారని సర్కారు కఠిన చర్యలకు పూనుకోగా, మొదట ఆర్‌ఆర్‌ చట్టంతోపాటు స్థానిక పోలీసుస్టేషన్లలో క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఇంకో అడుగు ముందుకేసి మిల్లర్ల ఆస్తుల మదింపు, లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యహారాలన్నింటిపైన చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది. అంతేకాక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఆదాయ పన్ను(ఐటీ), ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) నుంచి నోటీసులు వస్తున్నాయి. జిల్లాలో ఓ మిల్లర్‌ ఈ మేరకు ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఇంకా కొందరి జాబితా సిద్ధం చేసి చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి.

జిల్లాలో డీఫాల్ట్‌ మిల్లులకు ధాన్యం ఇవ్వకపోవడంతో మూడో వంతు మిల్లులు మూతపడ్డాయి. బకాయిలు ఉన్న మిల్లర్లకు ధాన్యం ఇవ్వకపోవడంతోనూ ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగడం లేదు. ఇక కొందరు పాత బాకీలు కట్టుకుంటూ ధాన్యం మళ్లీ పొందేందుకు తిప్పలు పడుతున్నారు. అయితే కొందరు బాకీ కట్టలేక సతమతం అవుతున్నారు. చాలామందికి ఆస్తులు ఉన్నప్పటికీ మార్కెట్‌ ధర లేక అవస్థలు పడుతున్నారు. రియల్‌ఎస్టేట్‌ రంగం కుదేలవడంతోనూ భూములు ఉన్న మిల్లర్ల అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లుగా ఇదే వ్యాపారంలో ఉన్న మిల్లర్లు చేతిలో పనిలేక అవస్థలు పడుతున్నారు. ఇటీవల కరీంనగర్‌ జిల్లాలో ఓ రైస్‌మిల్లర్‌ భార్య అప్పుల బాధతో మరణించగా, జిల్లాలోనూ అదే పరిస్థితి నెలకొందని మిల్లర్లు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement