వన్యప్రాణుల దాహార్తి తీర్చేలా | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణుల దాహార్తి తీర్చేలా

Mar 10 2026 1:21 PM | Updated on Mar 10 2026 1:21 PM

● సోలార్‌పంపులతో నీరు ● మరిన్ని సహజ వనరుల ఏర్పాటు ● అటవీశాఖ ముందస్తు ప్రణాళికలు

జన్నారం: వేసవి కావడంతో మార్చిలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి పక్షులు, జంతువులు, వన్యప్రాణులు దాహార్తి తీర్చుకునేందుకు పరుగులు తీసే అవకాశం ఉంది. నీటి సమస్య రాకుండా అటవీశాఖ ముందస్తు ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే అడవుల్లో సోలార్‌ పంపులు, నీటికుంటలు, వాగుల్లో చెలిమెల ఏర్పాటులో అధికారులు నిమగ్నమయ్యారు. జన్నారం అటవీ డివిజన్‌లోని మూడు అటవీ రేంజ్‌లు, 40 అటవీ బీట్‌లలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టారు. వాగులు, నీటి ఊటల నీటిని సహజసిద్ధంగా అందిస్తూనే నీటి ఎద్దడి గల ప్రాంతాల్లో సోలార్‌పంపుల ద్వారా నీరందించే ప్రయత్నం చేస్తున్నారు. 187 కుంటలు, 34 సోలార్‌ పంపులతోపాటు ర్యాంపు వెల్‌, నీటి చెలిమెల ద్వారా నీటి సౌకర్యం కల్పిస్తున్నారు.

చెలిమెలు

అడవుల్లో అనేక చోట్ల వాగులు ప్రవహిస్తున్నాయి. వేసవిలో కూడా నీరుండేవి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వన్యప్రాణులు నీరు తాగేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వాగుల్లో నీరుండే ప్రాంతంలో చెలిమెలు ఏర్పాటు చేస్తున్నారు. వీలైనన్ని చోట్ల చెలిమెలతోపాటు వాగునీటికి అడ్డంగా రాళ్లు, ఇసుకతో కట్ట కట్టి నీరు నిలిచి చెలిమెలా తయారు చేస్తున్నారు. పారే నీరు శుభ్రంగా ఉండడంతో తాగేందుకు వన్యప్రాణులు ఇష్టపడుతాయి.

ర్యాంపు వెల్స్‌ ఏర్పాటు

నీటి ఊటలు ఉన్న ప్రదేశాల్లో బావిలా గుంత తవ్వి నీరు రాగానే వన్యప్రాణులు సులువుగా దిగి తాగే విధంగా ర్యాంపు తయారు చేస్తారు. రెండు వైపుల ర్యాంపులు ఏర్పాటుతో వన్యప్రాణులు అందులో దిగి నీరు తాగుతాయి. గత రెండేళ్ల క్రితం డివిజన్‌లో 25 వరకు ర్యాంపువెల్‌లు ఏర్పాటు చేయగా.. అవి ప్రస్తుతం కూరుకుపోయాయి. దీంతో మళ్లీ తయారు చేయనున్నారు.

కుంటల ద్వారా నీరు

అటవీ ప్రాంతంలో భూగర్భజలాలు పెంచేందుకు, నీటి సౌకర్యం కోసం వర్షపు నీరు వృథా పోకుండా అటవీశాఖ అధికారులు ఉపాధి హామీ కింద నీటికుంటలు తవ్వించారు. జన్నారం అటవీ డివిజన్‌లో గత రెండేళ్ల క్రితం 300 వరకు నీటికుంటలు తవ్వగా ప్రస్తుతం 100కు పైగా వాటిల్లో నీరుంది. ఏప్రిల్‌, మేలో మరిన్ని కుంటల్లో నీరు ఎండిపోయే అవకాశం ఉండడంతో సోలార్‌ పంపుల ద్వారా నీటిని నింపే ప్రయత్నం చేస్తున్నారు.

సోలార్‌ పంపులకే ప్రాధాన్యం

అడవిలో సోలార్‌ విద్యుత్‌ పంపుల ద్వారా నీటి సౌకర్యం కల్పించేందుకు అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. జన్నారం అటవీ డివిజన్‌లోని మూడు అటవీ రేంజ్‌ల్లో 34 సోలార్‌ పంపులున్నాయి. అందులో 10 మరమ్మతులు చేయించాల్సి ఉంది. వీటి ద్వారా నీటిని కుంటల్లోకి వదులుతారు. ఈ ఏడాది మరో 10 సోలార్‌ పంపులు నూతనంగా వేయనున్నట్లు అధికారులు తెలిపారు. రెండు స్క్వైర్‌ కిలోమీ టర్లకు ఒక సోలార్‌ పంపు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గుట్టల ప్రాంతంలో కూడా నీటి సమస్య రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సోలార్‌ ద్వారా నిరంతరంగా పంపులు నడవడంతో నీరు కుంటల్లో నిండి వన్యప్రాణుల దాహార్తి తీర్చుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement