కాసిపేట: లక్సెట్టిపేట, బెల్లంపల్లి, దేవాపూర్ రేంజ్ పరిధిలోని అడవిలో రెండ్రోజులుగా చెలరేగిన మంటలు ఆదివారం రాత్రి అదుపులోకి వచ్చాయి. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది శ్రమించి బ్లోయర్లతో మంటలు ఆర్పివేశారు. మూడు రేంజ్‌ల పరిధిలోని మేడారం, ముత్యంపల్లి, దేవాపూర్, ర్యాలీగడ్‌పూర్ సెక్షన్‌లలో తీవ్రమైన అటవీ కొండ ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. సుమారు 200 ఎకరాలకుపైగా అటవీ సంపదకు నష్టం వాటిల్లడంతో భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. మంటలను అదుపు చేయడం సిబ్బందికి కష్టతరంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన నిప్పుతోనే అటవీ ఆహుతైనట్లు అధికారులు పేర్కొన్నారు. లక్సెట్టిపేట, దేవాపూర్ రేంజ్‌లలో ఇన్‌చార్జిలుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అడవిలో మంటలు చెలరేగిన ప్రదేశాలను బెల్లంపల్లి రేంజ్ అధికారి పూర్ణచందర్ పరిశీలించారు.


