పనికి గుర్తింపునివ్వాలి | - | Sakshi
Sakshi News home page

పనికి గుర్తింపునివ్వాలి

Mar 8 2026 7:33 AM | Updated on Mar 8 2026 7:33 AM

● పారిశుద్ధ్య కార్మికుల మనోగతం ● ‘సాక్షి’ స్టార్‌ రిపోర్టర్‌గా మంచిర్యాల డిప్యూటీ మేయర్‌ సల్ల రమ్య ● పారిశుద్ధ్య కార్మికులతో మాటామంతి

మంచిర్యాలటౌన్‌: ‘‘పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు రోడ్లపై చెత్తాచెదారం తొలగించడం, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా మా విధులు పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తున్నాం. మేము చేస్తున్న పనికి గుర్తింపు ఇవ్వాలి..’’ అని మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పారిశుద్ధ్య మహిళా కార్మికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో మంచిర్యాల డిప్యూటీ మేయర్‌ సల్ల రమ్య ‘స్టార్‌ రిపోర్టర్‌’గా 53వ డివిజన్‌లోని కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. కార్మికుల సేవలు, సమస్యలు తెలుసుకున్నారు. నిత్యం సబ్బులు, డ్రెస్‌లు, చెప్పులు, నూనె వంటివి అందించాలని, కొందరికి వేతనాలు ఆలస్యంగా వస్తున్నాయని డిప్యూటీ మేయర్‌ దృష్టికి తీసుకెళ్లారు. మరికొందరు పదేళ్లుగా పనిచేస్తున్నా పీఎఫ్‌, ఈఎస్‌ఐలు అందడం లేదని వివరించారు. వేసవి కాలంలో పని సమయాన్ని తగ్గించాలని, ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు గొడుగులు ఇవ్వాలని కోరగా.. ఆమె స్పందిస్తూ ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీనిచ్చారు. అనంతరం డిప్యూటీ మేయర్‌ రమ్య మాట్లాడుతూ నగర ప్రజల ఆరోగ్యం పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉందని అన్నారు. చెత్త తొలగించినప్పుడు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. చెత్తాచెదారం తొలగించేందుకు గ్లౌజులు, మాస్క్‌, బూట్లు ధరించాలని తెలిపారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత కోసం కార్మికులు చేస్తున్న శ్రమను కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement