డంపింగ్ యార్డు తరలేనా..!
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పడిన ఏడాది తర్వాత మొట్టమొదటి పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. పారిశుద్ధ్యం, తాగునీరు, కోతులు, వీధి కుక్కల బెడదతోపాటు శాశ్వత డంపింగ్‌యార్డు, మాస్టర్ ప్లాన్ అమలు పాలకవర్గానికి పెద్ద సవాల్‌గా మారనుంది. మంచిర్యాల, నస్పూరు మున్సిపాలిటీలతోపాటు హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామాల విలీనంతో కార్పొరేషన్ ఏర్పడిన విషయం తెలిసిందే. నగరంలోని ఆండాళమ్మ కాలనీలో డంపింగ్ యార్డు ఉండగా.. స్థలం కేటాయించి ఇతర ప్రాంతానికి తరలించాలని పదేళ్లుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నగర జనాభా, పరిధి పెరగడంతోపాటు రోజువారీ చెత్త సేకరణ పెరిగింది. చెత్త వేసేందుకు శాశ్వత డంపింగ్‌యార్డులు లేకపోవడంతో ఇబ్బందిగా మారుతోంది. ఆండాళమ్మ కాలనీలో తడి, పొడి చెత్త వేరు చేసేందుకు రెండెకరాల్లో ఏర్పాటు చేసిన డీఆర్సీ కేంద్రాన్ని చెత్త డంపింగ్ యార్డుగా మార్చి కొన్నేళ్లుగా వినియోగిస్తున్నారు. స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో డంపింగ్‌యార్డును తరలించే ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. ప్రతీరోజు 40 మెట్రిక్ టన్నులకు పైగా చెత్త వేస్తుండడం, తడి, పొడి చెత్తను వేరు చేయకపోవడంతో గుట్టలా పేరుకుపోతోంది. ఇటీవల బయోమైనింగ్ ప్రక్రియతో కొంత చెత్త తొలగించినా, రోజువారీ చెత్త వేస్తుండడంతో స్థలం నిండిపోవడం, కొందరు చెత్తకు నిప్పంటిస్తుండడంతో దుర్వాసన, పొగతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం
నగర పరిధిలోని నస్పూరుతోపాటు విలీన గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. పనులు చేయించడంలో అధికారులు కొంత విఫలం చెంద డం, నగరంలోనూ పారిశుద్ధ్యం సక్రమంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సేకరించిన చెత్తను కాలనీల్లో ఒకచోట వేసిన తర్వాత తొలగించేందుకు మూడు నాలుగు రోజులు పడుతోంది. కొందరు కార్మికులు, జవాన్లు పనులు చేయకుండానే హాజరు వేసుకుని వేతనాలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వారి గైర్హాజరుతో కార్మికుల సంఖ్య తగ్గి పారిశుద్ధ్య పనులు చేపట్టడంలో ఇబ్బందిగా మారుతోంది. రెండు కార్మిక సంఘాల యూనియన్లలో కీలకపాత్ర పోషిస్తున్న కొందరు కార్మికులు విధులకు హాజరు కాకుండా, అధికారుల ఆదేశాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పనిచేసే కొందరిపైనే భారం పడుతోంది. పాలకవర్గం పారిశుద్ధ్య విభాగాన్ని పటిష్టపరిస్తేనే సమస్యకు చెక్ పడుతుంది.


