బడి బయట 265మంది పిల్లలు | - | Sakshi
Sakshi News home page

బడి బయట 265మంది పిల్లలు

Feb 20 2026 6:35 AM | Updated on Feb 20 2026 6:35 AM

బడి బయట 265మంది పిల్లలు

బడి బయట 265మంది పిల్లలు

● 6 నుంచి 14ఏళ్లలోపు చిన్నారులు 126 ● 15 నుంచి19 ఏళ్లలోపు వారు 129

మంచిర్యాలఅర్బన్‌: జాతీయ విద్యావిధానం ప్రకారం బడి బయట ఉన్న పిల్లలపై నిర్వహించిన సర్వే పూర్తయింది. 6నుంచి 14ఏళ్లలోపు, 15నుంచి 19ఏళ్లలోపు వారు బడి బయట ఎంతమంది ఉన్నారనే దానిపై సర్వే సాగింది. గత ఏడాది నవంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు సర్వే నిర్వహించాల్సి ఉంది. ఎన్నికలు, ఇతర కారణాలతో గత జనవరి 30వరకు కొనసాగించారు. 18 మండలాల్లో సీఆర్పీలు, ఐఈఆర్పీలు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించారు. జిల్లాలో 265 మంది పిల్లలు బడిబయట ఉన్నారని గుర్తించారు.

ఇంటింటికి వెళ్లి..

బడి మానేసిన పిల్లలు, వలస కార్మికుల విద్యార్థుల వివరాలను సీఆర్పీ, ఐఈఆర్పీలతో సేకరించారు. జిల్లాలోని 18 మండలాల్లో 51 క్లస్టర్లలో సీఆర్పీలు, ఐఈఆర్పీల వివరాలు సేకరించారు. ఇందులో 6నుంచి 14ఏళ్లలోపు పిల్లలు, 15 నుంచి 19ఏళ్లలోపు వారీగా రెండు విభాగాలు గుర్తించారు. బడికి వెళ్లని విద్యార్థి పేరు, చిరునామా, తల్లిదండ్రుల పేర్లు, ఆధార్‌ సంఖ్యతోపాటు పాఠశాలకు ఎందుకు వెళ్లడం లేదనే వివరాలు తెలుసుకున్నారు. బడిలో ప్రవేశం పొందినప్పుడు ఆధార్‌ నంబరుతో అనుసంధానం ఆధారంగా బాలలను గుర్తించేందుకు సర్వే చేశారు. మండల స్థాయిలో బడి బయట బాలల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి జిల్లా స్థాయికి అక్కడి నుంచి ప్రభుత్వానికి నివేదించారు.

పాఠశాలలో చేర్పించడమే లక్ష్యం

వయస్సుల ఆధారంగా పిల్లలను ఓపెన్‌ పది, ఇంటర్‌లో చేర్పించనున్నారు. 6నుంచి 14ఏళ్లలోపు వారు 120మంది, 15నుంచి 19ఏళ్లు కలిగిన వారు 129మంది బడి బయట ఉన్నట్లు గుర్తించారు. ఇతర జిల్లాలకు చెందిన ముగ్గురు వలస కార్మికుల పిల్లలుగా గుర్తించగా.. జిల్లా నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిన పిల్లలు ఏడుగురు ఉన్నట్లు లెక్క తేల్చారు. 15నుంచి 19ఏళ్లలోపు పిల్లలను ఓపెన్‌ పది, ఇంటర్‌లో ప్రవేశం కల్పించారు. వారికి ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తూ పిల్లలను చదువు వైపు మళ్లించనున్నారు. సర్వేతో బడిబయట ఉన్న విద్యార్థుల సంఖ్యను గుర్తించడానికి వీలు కలిగిందని డీఈవో యాదయ్య తెలిపారు. వారిని పూర్తిస్థాయిలో పాఠశాలలు, ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ చదివించడానికి అవసరమయ్యే బడ్జెట్‌ కేటాయించడానికి సర్వే దోహదం చేస్తుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement