నేలబారు చదువులు
నెన్నెల: సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతులు నేటికీ నేలచూపులే చూస్తున్నాయి. విద్యార్థులకు మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీ, తరగతి గదుల సమస్యలే కాకుండా కూర్చోవడానికి బెంచీలూ లేకుండాపోయాయి. విద్యార్థులు నేలపైనే కూర్చోవాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. మండల వ్యాప్తంగా 60శాతం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు నేలపైనే కూర్చుంటున్నారు. మౌలిక వసతుల కల్పనకు స్కూల్ గ్రాంట్ నిధులు, కాంప్లెక్స్ నిధులు మంజూరవుతున్నా సరిపోవడం లేదు. మండలంలో ఉన్నత పాఠశాలలు 5, ప్రాథమికోన్నత 9, ప్రాథమిక పాఠశాలలు 18 ఉన్నాయి. మూడు వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 60శాతానికి పైగా పాఠశాలల్లో విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు లేవు. కొన్ని పాఠశాలల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. బడికి వచ్చిన నిధులతో సమకూర్చడానికి ఉపాధ్యాయులందరూ ఎస్‌ఎంసీ సభ్యులు తీర్మానం చేయాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా ఎవరూ దృష్టి సారించడం లేదు. వచ్చిన నిధులు స్కూల్ అవసరాలకే సరిపోతున్నాయని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు, దాతలు, నాయకులు స్పందించి బెంచీలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.


