‘అప్పు’డే భరించలేం..!
మన్సిపల్ ఎన్నికల్లో ఖర్చులు తడిసిమోపెడు
ఒక్కో రోజుకు అభ్యర్థుల వ్యయం రూ.లక్షల వరకు..
చేతులెత్తుస్తున్న పలువురు అభ్యర్థులు
పోలింగ్ నాటికి మరింతగా పెరగనున్న వ్యయం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు ప్రచార వ్యయం తడిసి మోపెడవుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు పైసా లేనిదే ప్రచారం ముందుకు సాగని పరిస్థితి నెలకొడంతో రోజుకు కనీసం రూ.20వేల నుంచి రూ.2లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. కాలనీల్లో తిరిగే ప్రచార రథాల వాహనాలకు రూ.వేల కొద్దీ చెల్లించాల్సి వస్తోంది. అనుచరగణం, కార్యకర్తలు, నాయకులు ఉదయం అల్పాహారం, టీలు, మధ్యాహ్నం లంచ్, రాత్రి భోజనం, మద్యం వీటితోపాటు ప్రచారానికి వచ్చే కూలీలకు కనీసం రూ.200 నుంచి రూ.500 వరకు చెల్లిస్తున్నారు. జెండాలు, కండువాలు ఇంకా అనేక ఖర్చులు ఉంటున్నాయి. ఎవరైనా జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకుల సభలు, సమావేశాలు, ర్యాలీలకు వస్తే ఈ ఖర్చు మరింత పెరిగిపోతోంది. ప్రచార రథాలు, సోషల్‌మీడియా కోసం ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. ప్రచారం కోసం ఒక్కో డివిజన్‌లో ఒకటి, రెండు వరకు రథాలు తిరుగుతున్నాయి. డప్పులు, మైక్‌లు, కళాకారులకు చెల్లించాల్సి వస్తోంది. ప్రచార పోస్టర్లు, ఇతర ఖర్చులు ఉంటున్నాయి. బైక్, వాహనాల ర్యాలీకి ఖర్చు చేయాల్సి వస్తోంది. వార్డులు, డివిజన్, జిల్లా ఎన్నికల ఇన్చార్జీలకు సైతం స్థానిక నాయకులే వసతి, భోజన ఖర్చులు భరించాల్సి వస్తోంది. దీంతో పోలింగ్ నాటికి ఈ ఖర్చులు భరించలేక చాలామంది అభ్యర్థులు చేతులేత్తేసే అవకాశం ఉంది. ఇప్పటికే స్వతంత్రులు, ప్రధాన పార్టీల్లో కొందరు అభ్యర్థులు ఖర్చులు తట్టుకోలేక తల్లడిల్లుతున్నారు. బయటకు చెప్పుకోలేక తంటాలు పడుతూ ఉన్న డబ్బునే పొదుపుగా వాడుకుంటున్నారు.
ఆస్తులు తాకట్టు పెట్టి ఆర్భాటాలు
చాలామంది అభ్యర్థులు ఆర్థికంగా ఉన్నప్పటికీ చేతిలో నగదు లేకుండా పోయింది. చర, స్థిర ఆస్తులు ఉన్నప్పటికీ ప్రస్తుతం చేతిలో డబ్బులు ఉంటేనే పనులు జరుగుతాయి. గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్, నిర్మాణ, ఇతర ఆధారిత రంగాలు ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. మార్కెట్‌లో డబ్బు ప్రవాహం తగ్గింది. చాలామంది చేతిలో నగదు లేకుండా పోయింది. దీంతో రోజు వారీగా వ్యాపారస్తులు, పలు రంగాల్లో ఉన్నవారి నుంచి తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది తమ ఇంట్లో బంగారం కుదువ పెట్టి, ఖర్చులు చేసుకుంటున్నారు. ఇంకా వడ్డీలకు అప్పులు తెస్తున్నారు. పార్టీ ఫండ్‌పై ఆశలు పెట్టుకున్నవారికి ఇప్పటి వరకు ఎవరికీ పైసా అందకపోవడంతో అందరూ కష్టంగానే భరిస్తూ వస్తున్నారు. ఇక అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నవారికి మరింత ఖర్చులు ఉన్నాయి. మొదట స్థానిక ఎమ్మెల్యేల నుంచి ఎంతో కొంత ఆశించారు. టికెట్ కోసమే పోటీ ఏర్పడడంతో ఆర్థికంగా బలంగా ఉన్న వారినే ఎంపిక చేశారు. ఖర్చు భరిస్తామని ముందే హామీ ఇస్తేనే టికెట్ ఇచ్చారు. దీంతో పార్టీ నుంచి ఎలాంటి పైసలు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇక పోలింగ్ నాటికి ఈ ఖర్చులకు తట్టుకుని చివరి వరకు ఎన్ని లక్షలు ఖర్చు చేసుకోవాల్సి వస్తోందోనని వాపోతున్నారు. ఇక మేయర్, చైర్మన్ పదవులు ఆశిస్తున్నవారంతా మరింత ఎక్కువగా ఖర్చు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా పోలింగ్ ముందు రెండు రోజులు ప్రలోభాల కోసం మద్యం, నగదు, బహుమతులకు అధికంగా ఖర్చవుతుంది.


