గల్ఫ్ కార్మికులకు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి
జన్నారం: గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం గల్ఫ్ బోర్డు ప్రకటించి బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లెడ భూమన్న డిమాండ్ చేశారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం ఆవిర్భవించి ఆరేళ్లు అవుతున్న సందర్భంగా ఆదివారం దుబాయ్‌లో ఆ శాఖ అధ్యక్షుడు ఎరుకల రాజుగౌడ్ ఆధ్వర్యంలో సంఘ నాయకులతో కలిసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం సంఘం అనేక కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. వివిధ కారణాలతో మృతిచెందిన వారి మృతదేహాలను స్వగ్రామాలకు తెప్పించడంలో కీలకంగా వ్యవహరించామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయలేదన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అలీం, దుబాయ్ కోఆర్డినేటర్లు రమేశ్, రామిరెడ్డి, నాయకులు సత్తన్న, తిరుపతి, రామన్న, మహేశ్, శ్రీనివాస్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.


