బాసరలో భక్తుల సందడి
బాసర: బాసర ఆలయంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహా రాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ద్వా దశి శుభ ముహూర్తంలో తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత అక్షరాభ్యాసం చేయించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈఓ అంజనాదేవి పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి సుమారు గంట సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు.
బీసీలకే ప్రాధాన్యం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు శుక్రవారం ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ప్రకారం ఆయా సామాజిక వర్గాలకు సీట్లను కేటాయించగా ఎస్సీలకు 9 స్థానాలు, 27వ డివిజన్ జనరల్ మహిళకు రిజర్వు కాగా, ఆ స్థానంలో ఎస్సీ అభ్యర్థికి అవకాశం కల్పించారు. బీసీ స్థానాలు 20, జనరల్ స్థానాల్లో నుంచి 21 స్థానాలను సైతం బీసీలకే కేటాయించారు. జనరల్ స్థానాలు మొత్తం 30 ఉండగా, కేవలం 8 మంది ఓసీ అభ్యర్థులకు ఆయా స్థానాలను కేటాయించారు. బీసీల్లోనూ ఎక్కువగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను ఎంపిక చేశారు.


