కానిస్టేబుల్ సమయస్ఫూర్తి..
నిర్మల్‌టౌన్: పోలీస్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. శుక్రవారం ఉదయం సుమారు 7:50 గంటల సమయంలో భార్యాభర్తలు బైక్‌పై స్థానిక పోలీస్ పంపు వద్దకు వచ్చారు. పెట్రోల్ పోయించుకున్న అనంతరం ఆ వ్యక్తికి అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో బైక్‌పై నుంచి కిందపడ్డాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నవీన్ అప్రమత్తమై సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేసి ప్రాణాలు కాపాడాడు. కానిస్టేబుల్ చూపిన సమయస్ఫూర్తి, ధైర్యం, మానవత్వంతో ఆ వ్యక్తి ప్రాణాలు నిలబడ్డాయి. తర్వాత ఆ వ్యక్తిని వెంటనే మరో వాహనంలో సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. కానిస్టేబుల్ నవీన్‌ను జిల్లా ఎస్పీ జానకీ షర్మిల అభినందించారు.


