నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
చెన్నూర్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చెన్నూర్‌లో శుక్రవారం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు పెద్దఎత్తున తరలిరావడంతో నామినేషన్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ కేంద్రానికి వంద మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉంది. కేంద్రంలోకి ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా పెద్దఎత్తున ఆయా పార్టీల కార్యకర్తలు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను అనుమతిస్తూ బీఆర్‌ఎస్ నాయకులను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. సీఐ బన్సీలాల్ సంఘటన స్థలానికి చేరుకొని అన్ని పార్టీలకు నిబంధనలు ఒకే విధంగా ఉంటాయని, అందరూ పోలీసులకు సహకరించాలని సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు.


