● మున్సిపల్ ఎన్నికల్లో భారీగా ఆశావహులు ● ఒక్కో వార్డు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కొట్లాట నడుస్తోంది. వార్డులు, డివిజన్లు, చైర్‌పర్సన్, మేయర్ స్థానాలకు రిజర్వేషన్ల ఖరారుతో ఆశావహుల మధ్య పోటీ పెరిగింది. తమకు టికెట్లు ఇప్పించాలని స్థానిక ఎమ్మెల్యేలను కోరుతున్నారు. ఒక్కో వార్డు నుంచి ఇద్దరు ముగ్గురు టికెట్లు ఆశిస్తున్న తరుణంలో సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేగాక కొత్త, పాత నాయకుల మధ్య వర్గ పోరు నడుస్తోంది. దీంతో ఎవరికి టికెటు ఇస్తే ఏం జరుగుతుందోననే తర్జనభర్జన పడుతున్నారు. సోమవారం క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ నిర్వహించిన సమావేశంలో ‘పైసలు ఇచ్చిన వారికే టికెట్లు అమ్ముకుంటున్నా రు..’ అంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగారు. డీసీసీ అధ్యక్షుడు జోక్యం చేసుకుని సర్దిచెప్పినా కాసేపు నాయకులు వాగ్వాదం చేసుకున్నారు. అభ్యర్థుల జాబితా ప్రకటించే నాటికి టికెట్ల కోసం గొడవలు మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏళ్లుగా జెండా మోస్తున్న కార్యకర్తలు, నాయకులు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు పార్టీ రహస్యంగా చేపడుతున్న సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలే ఎంపికలో ప్రధానంగా వ్యవహరిస్తున్న తరుణంలో నాయకుల్లో ఆందోళన నెలకొంది. ఇక కొందరు టికెట్ రాకపోతే పార్టీ మారుదామనే ఆలోచనలు కూడా చేస్తున్నారు.
కార్పొరేషన్‌లోనూ టికెట్ల ఫైట్
మంచిర్యాల కార్పొరేషన్ పరిధి డివిజన్ల వారీగా కార్పొరేటర్ స్థానాలకు టికెట్ల కోసం పోటీ నెలకొంది. ఆశావహులు తమకు టికెట్ ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే కొందరికి హామీ దక్కింది. అయితే బీ ఫాం చేతిలో పడే వరకు ఏదైనా జరగొచ్చనే తీరుతో నాయకుల్లో టెన్షన్ నెలకొంది. డివిజన్లలో ఆశావహుల్లో బలాబలాలపై ఆరా తీసి, ప్రజాదరణ వంటి కోణాలు లెక్కలోకి తీసుకుంటున్నారు. కొందరు ఆర్థికంగా ఉన్న శ్రీమంతులకే అవకాశాలు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 60డివిజన్లలో మంచిర్యాల, నస్పూర్, శ్రీరాంపూర్‌తోపాటు విలీన గ్రామాలైన వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట, పోచంపాడు, కొత్తపల్లి, నంనూరు, చందనగర్, నర్సింగాపూర్, అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ప్రతీ డివిజన్ పరిధిలో ఇద్దరు, ముగ్గురేసి పోటీలో ఉండడంతో సమస్య తలెత్తుతోంది.
పంచాయతీ ఎన్నికల్లోనే అనుభవాలు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అవకాశం రాని కొందరు పార్టీ నాయకులు రెబెల్‌గా పోటీ చేశారు. కొన్ని చోట్ల రెబెల్‌గా వేసిన అభ్యర్థులే గెలిచిన సందర్భాలు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు చెప్పినా వినకుండా పోటీలో దిగారు. పార్టీ ఆదేశాలు ధిక్కరించిన ఘటనలూ ఉన్నాయి. అంతా కలసికట్టుగా ఉంటే వర్గ పోరు లేకుంటే మరిన్ని సర్పంచ్ స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉండేవని పార్టీ నాయకులే చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపిక సరిగా జరగలేదనే అపవాదు ఉంది. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూ రు, ఖానాపూర్(జన్నారం) నియోజకవర్గాల్లో అనేక మంది నాయకులు పార్టీ ఆదేశాలను ధిక్కరించి పోటీలో నిలిచారు. దీంతో అధికా ర పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారు. ఈ ఫలితాల ప్రభావం స్థానిక ఎమ్మెల్యేలపై పడింది. తాజాగా మంచిర్యాల నగరంతోపాటు బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతనపల్లి, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపిక నాయకులకు సవాల్‌గానే మారింది.
చైర్‌పర్సన్, మేయర్‌కు బలమైన అభ్యర్థులు
మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన చైర్‌పర్సన్, మేయర్ ఎంపిక కోసం బలమైన అభ్యర్థుల కోసం వేట నడుస్తోంది. ఇప్పటికే ఇద్దరు ముగ్గురిని ఫైనల్ చేసినా పేర్లు అధికారికంగా వెల్లడించడం లేదు. రిజర్వేషన్లు కలిసొచ్చిన నాయకులు, ఖర్చు పెట్టుకునే స్థాయిలో ఉన్నవారికి, ఎమ్మెల్యేలకు అత్యంత సన్నిహితంగా, నమ్మకంగా ఉన్న వారికి అవకాశం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు రూ.లక్షలు కుమ్మరించేందుకు సిద్ధంగా ఉన్న వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు.
మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌చార్జీలు
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ఇన్చార్జీలను నియమించింది. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆదిలాబాద్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్‌రెడ్డి ఇన్‌చార్జిలుగా వ్యవహరించనున్నారు.


