అటవీ ప్రాంతాల్లో సారా తయారీ
మంచిర్యాలక్రైం: జిల్లాలోని గ్రామీణ అటవీ ప్రాంతాల్లో నాటుసారా తయారీ యథేచ్ఛగా సాగుతోంది. చెన్నూర్ నియోజకవర్గంలోని కోటపల్లి, నీల్వాయి, వేమనపల్లి, బెల్లంపల్లి నియోజకవర్గంలోని అటవీ ప్రాంత సమీప గ్రామాల్లో సారా తయారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బట్టీలు ఏర్పాటు చేసుకుని తయారు చేస్తూ వందల లీటర్లు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ జోరుగా విక్రయించినట్లు తెలిసింది. సారా తయారీకి అవసరమైన ముడిసరుకులు బెల్లం, యూరియా, పటికతోపాటు అవసరమైన ఆహార పదార్థాలు కుండలు, క్యాన్లలో తీసుకెళ్తున్నారు. నీటి వసతి ఉన్న చోట సారా బట్టీలు ఏర్పాటు చేసి రోజుల తరబడి అడవుల్లోనే మకాం వేస్తున్నారు. సారా తయారు కాగానే క్యాన్లలో పల్లెలు, పట్టణాలకు తరలిస్తున్నారు. సారా తయారీ కూలీలకు భోజనంతోపాటు రోజువారీగా రూ.300 నుంచి రూ.500 వరకు చెల్లిస్తున్నారు.
ముడిసరుకుపై నియంత్రణేది..!
సారా తయారీకి ఉపయోగించే ముడిసరుకు రవాణాను అరికట్టడంలో ఎకై ్సజ్ శాఖ విఫలమైందనే ఆరోపణలున్నాయి. గత మూడేళ్లలో ఒక్కసారైనా బెల్లం, పటిక విక్రయించే దుకాణాలపై దాడులు చేసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. జిల్లా సరిహద్దు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, పూణే, నాగ్‌పూర్, అనకాపల్లి ప్రాంతాల నుంచి గుడుంబా తయారీకి ఉపయోగించే ముడిసరుకు జిల్లాకు సరఫరా అవుతోంది. జిల్లా కేంద్రంలోని కొందరు వ్యాపారులు ముడిసరుకును యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం సమ్మక్క–సారక్క జాతరకు ఎత్తు బంగారం చెల్లించడానికి బెల్లం పెద్ద మొత్తంలో అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో వ్యాపారులు బెల్లం నిల్వలు, విక్రయాలకు ఎలాంటి అనుమతి తీసుకోవడం లేదు. మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, చెన్నూర్ ప్రాంతాలకు టన్నులకొద్దీ బెల్లం చేరుకుంది. ఇదే అదునుగా భావించిన కొందరు వ్యాపారులు గుడుంబా తయారీదారులకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
నామమాత్రపు దాడులు
ఎకై ్సజ్ శాఖలో పని చేసే కొందరు తయారీదారుల నుంచి ప్రతీ నెల మామూలు తీసుకుంటూ ఉన్నతాధికారుల కదలికలు, దాడుల సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నామమాత్రపు దాడులు నిర్వహించి బెల్లం పానకం, సారా స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారే గానీ తయారీదారులపై చర్యలు తీసుకోవడంలో ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.


