గనులపై పులి భయం
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని పలు గనులపై పులి భయం వెంటాడుతోంది. గత నాలుగు రోజులుగా రెండు పులులు జైపూర్ మండలంలో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు ధ్రువీకరించారు. పులులు సంచరించే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండింటిలో ఒక పులి రెండ్రోజులుగా గనుల వెనుకాల ఉన్న గ్రామ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తోంది. గురువారం రాత్రి ఆర్కే 8 గని సమీపంలో శ్మశానవాటిక వద్ద పులి కనిపించింది. అదే సమయంలో హైదరాబాద్‌కు వెళ్తున్న రమేశ్ వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. డిప్యూటీ ఫారెస్టు రేంజ్ అధికారి అజహర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పులి ఎటువైపు వెళ్లిందో పరిశీలిస్తున్నారు. పులి సంచారంతో ఆర్కే 5, ఆర్కే 7, ఆర్కే న్యూటెక్ గనుల కార్మికులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి షిఫ్ట్ వెళ్లేవారు, సెకండ్ పూర్తి చేసుకుని ఇళ్లకు చేరేవారు భయాందోళనకు గురవుతున్నారు.
మందమర్రి మండలంలో..
మందమర్రిరూరల్: మందమర్రి మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం రాత్రి పులి సంచరించింది. గురువారం వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధి అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను డిప్యూటీ ఫారెస్ట్ రెంజ్ ఆఫీసర్ సంతోష్ గుర్తించారు. మామిడిగట్టు, ఆదిల్‌పేట్ ఎర్రచెరువు మీదుగా కొండెంగల వాగు నుంచి వెంకటాపూర్ మీదుగా ఆర్కే–5 గని సమీపం వరకు పాదముద్రలు కనిపించాయి. రాత్రి వెంకటాపూర్ మీదుగా పొన్నారం తుర్కపల్లి, సారంగపల్లి గ్రామాలకు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు, పత్తి కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
గనులపై పులి భయం


